ముంబై: ఇటీవలే ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాణించిన యువ పేసర్ కాశ్వీ గౌతమ్‌కు జాతీయ జట్టు నుంచి పిలుపొచ్చింది. ఈనెల 27 నుంచి శ్రీలంక, దక్షిణాఫ్రికాతో జరుగబోయే ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆమె హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియాలో చోటు దక్కించుకుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం జట్టును ప్రకటించగా.. కాశ్వీతో పాటు నిరుడు దేశవాళీ టోర్నీలలో సత్తా చాటిన లెఫ్టార్మ్ స్పిన్నర్లు శ్రీచరణి, శుచి ఉపాధ్యాయకు చోటు దక్కింది. కానీ ఓపెనర్ షెఫాలీ వర్మకు సెలెక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. డబ్ల్యూపీఎల్-3వ సీజన్లో ఆమె.. 9 ఇన్నింగ్స్‌లో 304 పరుగులు చేసినా సెలెక్టర్లు ఆమెను పక్కనబెట్టారు. ఈ ఏడాది జనవరిలో ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో చోటు కోల్పోయిన స్నేహ్ రాణా, యస్తికా భాటియా, అరుంధతిరెడ్డి తిరిగి జట్టులోకి వచ్చారు. ఏప్రిల్ 27 నుంచి శ్రీలంకలో మొదలుకాబోయే ఈ సిరీస్.. మే 11న ముగియనుంది.