Ind Vs Sa T20 | లక్నోలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బీసీసీఐపై విమర్శలు గుప్పించారు. లక్నోలోని ఇలాంటి పరిస్థితుల్లో స్టేడియానికి ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను కేటాయించడంపై మండిపడ్డారు. లక్నోలోని భారత్ రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ టాస్ వేయకుండానే రద్దయ్యింది. దట్టమైన పొగమంచు కారణంగా విజిబులిటీ తక్కువగా ఉండడంతో మ్యాచ్‌ను నిర్వహించడం కష్టతరంగా మారింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో బీసీసీఐ టూర్ అండ్ ఫిక్చర్స్ కమిటీ మరోసారి విమర్శల పాలైంది. శీతాకాలంలో ఉత్తర, తూర్పు భారత్‌లో డే-నైట్ మ్యాచ్‌లు నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
లక్నోకు మ్యాచ్ కేటాయించిన సమయంలోనే వివాదాస్పదమైంది. వాస్తవానికి, స్టేడియంలో పొగమంచు ఎంత దట్టంగా ఉందంటే.. గాలిలో బంతిని ట్రాక్ చేయడం ఫీల్డర్లకు ప్రమాదకరంగా భావించారు. దాంతో పదే పదే టాస్‌ను వాయిదా వేశారు. అంపైర్లు ఆరుసార్లు మైదానాన్ని పరిశీలించారు. కానీ, చివరకు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. టాస్ సాయంత్రం 6.30 గంటలకు వేయాల్సి ఉండగా.. పొగమంచు కారణంగా వాయిదా వేశారు. ఆ తర్వాత రాత్రి 7.30, 8, 8.30, 9.25 గంటలకు మైదానాన్ని పరిశీలించారు. పిచ్, బౌండరీ లైన్ వద్ద ఇద్దరు అంపైర్లు నిలబడి.. ఫీల్డర్లు బంతిని చూడగలరా? లేదా? అనే విషయాన్ని పరిశీలించారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు, యూపీసీఏ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి మైదానాన్ని పరిశీలించారు. దాంతో పొగ మంచు కారణంగా మ్యాచ్ ఆడడం వీలు కాదని తేలింది.
ఈ క్రమంలో శశిథరూర్ స్పందించారు. లక్నో భారత్-దక్షిణాఫ్రికా నాలుగో టీ20 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారన్నారు. ఉత్తర భారతదేశంలోని చాలా నగరాల్లో దట్టమైన పొగ మంచు, గాలి నాణ్యత సూచీ 411, విజిబిలిటీ తక్కువగ ఉండడం మ్యాచ్ నిర్వహించడం అసాధ్యమన్నారు. ఏక్యూఐ సుమారు 68 ఉన్న తిరువనంతపురంలో ఈ మ్యాచ్ నిర్వహించి ఉండాల్సిందన్నారు. ఇదిలా ఉండగా.. లక్నో స్టేడియంలో మ్యాచ్ కోసం వచ్చిన పలువురు క్రికెటర్లు మాస్కులతో కలిపించారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాస్క్ ధరించి కనిపించాడు. దక్షిణాఫ్రికా జట్టు మొదట తేలికపాటి వార్మప్ కోసం మైదానంలోకి వచ్చింది. కానీ, దట్టమైన పొగమంచు కారణంగా డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం భారత్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్ డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సిరీస్‌ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలని ప్రొటీస్ జట్టు భావిస్తున్నది.