దుబాయ్: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రీదిపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది(Shahid Afridi) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియాకప్‌లో ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ బౌలర్‌గా రాణించలేకపోయాడు. దీని పట్ల షాహిద్ అసహనం వ్యక్తం చేశాడు. వాస్తవానికి ఆ మ్యాచ్‌లో షాహీన్ బ్యాటర్‌గా రాణించాడు. అతను 16 బంతుల్లో 33 రన్స్ స్కోర్ చేసి పాక్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. కానీ బాల్‌తో ఇండియన్ బ్యాటర్లను ఇబ్బందిపెట్టలేకపోయాడు. అయితే సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రిది స్వంత అల్లుడు షాహీన్‌పై గరం అయ్యాడు. షాహిన్ పర్ఫార్మెన్స్ సంతోషకరంగా లేదన్నాడు.
షాహీన్ స్కోరు చేయడం వల్లే పాక్ వంద పరుగుల మార్క్ దాటిందని, దానికి థ్యాంక్స్ చెబుతున్నానని, కానీ షాహీన్ నుంచి కావాల్సింది పరుగులు కాదు అని, షాహీన్ పటిష్టమైన బౌలింగ్ చేయాలని, అలాగే సామ్ అయూబ్ నుంచి కూడా తాను బౌలింగ్ ఆశించడం లేదన్నాడు. సామ్ అయూబ్ నుంచి రన్స్ రావాలన్నారు. కొత్త బంతిని స్వింగ్ చేసే సత్తా షాహీన్‌కు ఉందని, ఆ బంతులతో వికెట్లను ఎలా తీయాలో అతను తెలుసుకోవాలని షాహిద్ అఫ్రిది అన్నాడు. తన గేమ్ ప్లాన్‌పై అతను ఫోకస్ పెట్టాలన్నాడు.
పెద్ద జట్లతో క్రికెట్ ఆడుతున్నప్పుడు మైండ్ గేమ్స్ ఆడడం షాహీన్ నేర్చుకోవాలని షాహిద్ తెలిపాడు. వికెట్లు తీయడంతో అతని కర్తవ్యం కాబట్టి, దాని కోసం మైండ్ గేమ్స్ తప్పవన్నారు. తన బౌలింగ్ ట్యాలెంట్‌తో షాహీన్ పాకిస్థాన్‌కు విజయాలు అందించాలన్నాడు. పాకిస్థాన్‌లో దేశవాళీ క్రికెట్ సరైన రీతిలో లేదని షాహిద్ ఆరోపించాడు. దేశవాళీలోని ఫస్ట్ క్లాస్ క్రికెట్.. థార్డ్ క్లాస్ తరహాలో ఉందన్నాడు. దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌పై పీసీబీ ఎక్కువ పెట్టుబడి పెట్టాలని షాహిద్ డిమాండ్ చేశాడు. దేశవాళీ క్రికెట్ వ్యవస్థ బలోపేతం కావాలన్నారు.