Shaheen Afridi : పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రావల్పిండిలో రసవత్తరంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ ప్రధాన పేసర్ షాహీన్ ఆఫ్రిది (Shaheen Afridi) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మామూలుగా అయితే వికెట్ తీయగానే రెండు చేతులు పైకెత్తి తనదైన సిగ్నేచర్ స్టయిల్లో సెలబ్రేట్ చేసుకుంటాడు. కానీ, ఈసారి మాత్రం అతడు వెరైటీగా సంబురాలు చేసుకున్నాడు.
బంగ్లా ఆటగాడు హసన్ మహమూద్ వికెట్ పడగొట్టగానే ఈ స్పీడ్‌స్టర్ బుజ్జాయిని ఒడిలో ఆడిస్తున్నట్టు చేతుల్ని అటూ ఇటూ కదిపాడు. ఏంటబ్బా విషయం అని ఆరా తీస్తే.. ఆఫ్రిది ఈమధ్యే తండ్రి అయ్యాడు. కుమారుడు పుట్టిన సంతోషంలో ఉన్న అతడు ఆ విధంగా వికెట్ సెలబ్రేషన్ చేసుకున్నాడన్నమాట. ప్రస్తుతం ఆఫ్రిది వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసినవాళ్లంతా పాక్ పేసర్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
That Celebration 👶@iShaheenAfridi’s first wicket after the birth of his son! 😍#PAKvBAN | #TestOnHai pic.twitter.com/3x0jwtOHw3
— Pakistan Cricket (@TheRealPCB) August 24, 2024
పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది కూతురిని షాహీన్ నిరుడు వివాహం చేసుకున్నాడు. భార్య కాన్పు సమయం దగ్గరపడడంతో ఆఫ్రిది బంగ్లాతో టెస్టు సిరీస్‌కు దూరం అవ్వాలని అనుకున్నాడు. కానీ, దేశం తరఫున ఆడాలనే ఉద్దేశంతో తాను అందుబాటులోనే ఉంటానని సెలెక్టర్లుకు చెప్పాడు. అతడి భార్య అన్ష అఫ్రిది పండంటి మగబిడ్డను కన్నది. తమ బిడ్డకు ఆఫ్రిది దంపతులు ‘అలి యార్’ అని నామకరణం చేశారు.