S Dinakar : విధి నిర్వహణలో మరో జర్నలిస్ట్ ప్రాణాలు విడిచాడు. భారత్ – ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కవరేజ్ ఇస్తున్న సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అయిన ఎస్ దినకర్ (57) కన్నుమూశాడు. ఆయన ది హిందూ పత్రికలో డిప్యూటీ స్పోర్ట్స్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. ఇండోర్‌లోని హోటల్ రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే… అప్పటికే దినకర్ మృతి చెందాడని వైద్యులు చెప్పారని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. దినకర్ చనిపోవడానికి గుండెపోటు ప్రధాన కారణం అని డాక్టర్లు వెల్లడించారు.
దినకర్ ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టు కవరేజి ఇచ్చాడు. ఆఖరి టెస్టుకు వేదికైన అహ్మదాబాద్‌కు అతను మంగళవారం వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన సోమవారం ప్రాణాలు విడవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. దినకర్ సోమవారం బీసీసీఐ మాజీ సెక్రటరీ సంజయ్ జగ్దలేతో ఫోన్లో మాట్లాడాడు. ‘దినకర్ నన్ను కలిసి ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకున్నాడు. అయితే.. సోమవారం ఫోన్ చేసి మాట్లాడాడు. హోల్కర్స్ టీమ్ దూకుడుగా ఆడడం గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం’ అని సంజయ్ తెలిపాడు. దినకర్ మృతి పట్ల పూర్తి వివరాలు తెలిశాక మాట్లాడతానని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంపత్ ఉపాధ్యాయ్ చెప్పాడు.