రావల్పిండి: పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు(Sri Lanka Team)కు భద్రతను పెంచేశారు. మంగళవారం ఇస్లామాబాద్‌లోని సెషన్స్ కోర్టు వద్ద పేలుడు ఘటన జరిగిన నేపథ్యంలో అతిధి జట్టుకు భద్రతను పెంచారు. పీసీబీ చైర్మెన్‌తో పాటు పాక్ హోంశాఖ మంత్రిగా ఉన్న మోషిన్ నఖ్వీ దీనిపై స్పందించారు. శ్రీలంక క్రికెట్‌కు చెందిన అధికారులతో చర్చించామని, ఆ జట్టుకు భద్రతను కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఇస్లామాబాద్‌లోని జీ-11 ఏరియాలో ఉన్న జిల్లా, సెషన్స్ కోర్టు బిల్డింగ్ ఆవరణలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతిచెందగా, మరో 36 మంది గాయపడ్డారు. అయితే ఆ పేలుడు ఘటనకు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న తాలిబన్ ప్రభుత్వానిదే బాధ్యత అని పాకిస్థాన్ ఆరోపిస్తున్నది. పాక్, ఆఫ్ఘన్ మధ్య కొన్నాళ్లుగా ఉద్రిక్తతలు ఉన్నాయి. బోర్డర్ సమీపంలో రెండు దేశాలు దాడులకు పాల్పడుతున్నాయి. దోహాలో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో ఆ ఉద్రిక్తత మరింత ఆందోళనకరంగా మారింది.
శ్రీలంకతో జరిగిన ఫస్ట్ వన్డేలో పాకిస్థాన్ జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 రన్స్ చేసింది. అయితే చేజింగ్‌లో లంక జట్టు తీవ్ర పోరాటం చేసింది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 293 రన్స్ మాత్రమే చేసింది. పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. శ్రీలంక, పాక్ మధ్య 3 వన్డేలు జరగనున్నాయి. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగే ట్రై సిరీస్‌లో ఆ జట్టు పాల్గొంటుంది.