కాన్పూర్: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈనెల 27 నుంచి కాన్పూర్ వేదికగా జరగాల్సి ఉన్న రెండో టెస్టుకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసను నిరసిస్తూ ‘అఖిలేష్ భారతీయ హిందు మహాసభ’ ఆధ్వర్యంలో పలువురు ఆందోళనకారులు నిరసనకు దిగడంతో పాటు మ్యాచ్ను జరుగనివ్వబోమని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మ్యాచ్ జరిగే గ్రీన్ పార్క్ స్టేడియానికి సమీపంలో ఆందోళనకు దిగిన ఈ గ్రూప్ సభ్యులలో 20 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అంతేగాక బంగ్లాదేశ్ జట్టుకు అదనపు భద్రతను సమకూర్చుతున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. మంగళవారమే కాన్పూర్ చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లూ స్థానికంగా ఉన్న లాండ్మార్క్ హోటల్లో స్టే చేస్తుండగా హోటల్ వద్ద భద్రతను పెంచినట్టు కాన్పూర్ అడిషినల్ కమిషనర్ హరీష్ చందర్ తెలిపారు.