Kanpur Test | కాన్పూర్: భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టును వరుణుడు నీడలా వెంటాడుతున్నది. దాదాపు మూడేండ్ల తర్వాత జరుగుతున్న మ్యాచ్‌ను ఆస్వాదిద్దామనుకున్న ప్రేక్షకుల ఆశలపై నీళ్లు గుమ్మరిస్తున్నాడు. ముందే ఊహించినట్లు, వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తొలి రోజే మ్యాచ్‌కు అంతరాయం కల్గిన వర్షం రెండో రోజు ఆటను పూర్తిగా తుడిచిపెట్టింది. రాత్రి నుంచి కురిసిన ఎడతెరిపిలేని వర్షానికి మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. ఉదయం 11.15 నిమిషాలకు కొంత తెరిపినిచ్చినా..గ్రౌండ్స్‌మెన్ మూడు సూపర్ సాపర్లతో మైదానాన్ని సిద్ధం చేసేందుకు ప్రయత్నించినా వెలుతురు సరిగ్గా లేకపోవడంతో ఆట సాధ్యపడలేదు.
పరిస్థితులు ఆటకు అనుకూలంగా లేకపోవడంతో మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మధ్యాహ్నం 2.15గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ రిపోర్టుల ప్రకారం ఆదివారం కూడా వర్షం కొనసాలగే అవకాశాలు కనిపిస్తుండగా, సోమ, మంగళవారాలు కొంత తెరిపినిచ్చే చాన్స్ ఉంది. దీంతో మ్యాచ్ దాదాపు డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌కు టాస్ చేజార్చుకున్న బంగ్లా తొలి ఇన్నింగ్స్లోమూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వర్షం కారణంగా టీమ్ఇండియా ప్లేయర్లు ఇండోర్‌లో ప్రాక్టీస్ చేశారు. బ్యాచ్‌లుగా విడిపోయి సరదాగా ఫుట్‌బాల్ ఆడారు.