న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ ప్రాతినిధ్యంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. భద్రతా కారణాల రీత్యా తాము భారత్లో ఆడలేమంటూ ఇప్పటికే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించగా, ఐసీసీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. మెగాటోర్నీలో బంగ్లా ఆడుతుందా లేదా అన్నది శనివారం తేలనుంది. భద్రతను కారణంగా చూపుతూ తమ మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించాలంటూ బీసీబీ ప్రతిపాదనను తిరస్కరించిన ఐసీసీ నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాల స్పష్టంగా పేర్కొంది. అయితే గవర్నింగ్ బాడీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీసీబీ తాజాగా డిస్పూట్ రిసల్యూషన్ కమిటీ(డీఆర్సీ)ని ఆశ్రయించింది.
ఆఖరి అవకాశంగా డీఆర్ఎస్కు లేఖ రాసిన బీసీబీ నిర్ణయం వేచిచూస్తున్నది. ఒకవేళ అది వ్యతిరేకంగా వస్తే చివరగా అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానం(సీఏఎస్)లో అప్పీల్ చేసుకునే చాన్స్ బీసీబీకి ఉంటుంది. ఇదిలా ఉంటే ఐసీసీ రాజ్యాంగాన్ని, నిబంధనలు ఓసారి పరిశీలిస్తే బోర్డు డైరెక్టర్లు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా డీఆర్సీకి స్పందించే హక్కు ఉండదని స్పష్టంగా ఉంది.
భారత్లోనే బంగ్లా మ్యాచ్లు జరుగాలంటూ జరిగిన ఓటింగ్లో బోర్డు డైరెక్టర్లు 14-2తో ఆమోదం తెలిపిన నేపథ్యంలో బీసీబీకి మరోమారు చుక్కెదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే మెగాటోర్నీలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు బెర్తు దక్కడం ఖాయంగా కనిపిస్తున్నది.