దుబాయ్ : ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్‌నకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీలో 8 జట్లు పాల్గొననున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30న భారత్, శ్రీలంక మధ్య బెంగళూరు వేదికగా జరుగబోయే మ్యాచ్‌తో ఆరంభమయ్యే 13వ వన్డే ప్రపంచకప్.. నవంబర్ 02న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. అక్టోబర్ 29న తొలి సెమీఫైనల్ గువహతి (ఒకవేళ పాకిస్థాన్ సెమీస్‌కు అర్హత సాధిస్తే కొలంబోలో) జరుగనుండగా అదే నెల 30న బెంగళూరులో రెండో సెమీస్ జరుగుతుంది. పాకిస్థాన్ గనక ఫైనల్ చేరితే ఫైనల్ పోరుకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
భారత్ లోని బెంగళూరు, గువహతి, వైజాగ్, ఇండోర్‌లో మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా శ్రీలంకలోని కొలంబో ఏకంగా 11 లీగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. ఇక టోర్నీకే హైలైట్‌గా నిలిచే భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే దాయాదుల పోరు అక్టోబర్ 05న కొలంబో వేదికగా నిర్వహించనున్నారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు వచ్చేందుకు పాక్ నిరాకరించడంతో ఆ జట్టు ఆడాల్సిన మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిన కొలంబోలో ఆడించనున్నారు. 2013 తర్వాత భారత్ నిర్వహించనున్న ఐసీసీ ట్రోఫీ (మహిళల క్రికెట్లో) అవడంతో దీనిని విజయవంతం చేసేందుకు బీసీసీఐ పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసింది.
డిఫెండింగ్ చాంపియన్స్ ఆస్ట్రేలియాతో పాటు గత ఎడిషన్ రన్నరప్ ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక నేరుగా అర్హత సాధించగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు క్వాలిఫయర్స్ ద్వారా ఈ మెగా టోర్నీలో ఎంట్రీ ఇచ్చాయి. 28 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్న ఈ టోర్నీలో ఒక్కో జట్టు.. మిగిలిన జట్లతో తలా ఒక్క మ్యాచ్ ఆడనుంది. లీగ్ దశలో టాప్-4లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. ఆస్ట్రేలియా.. అక్టోబర్ 01న ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో న్యూజిలాండ్ మ్యాచ్‌తో టైటిల్ వేటను ప్రారంభించనుంది.