జకార్తా: మలేషియా బ్యాడ్మింటన్ ఓపెన్‌లో భారత స్టార్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి రన్నరప్‌గా నిలిచింది. టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన సాత్విక్, చిరాగ్ జోడీ ఆదివారం జరిగిన ఫైనల్లో 21-9, 18-21, 17-21తో ప్రపంచ నంబర్‌వన్ జంట లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్ చేతిలో పోరాడి ఓడింది. మలేషియా సూపర్ ఓపెన్‌లో తొలిసారి ఫైనల్ ఫైట్‌లో నిలిచిన భారత జోడీగా నిలిచిన సాత్విక్, చిరాగ్ టైటిల్ కలను నెరవేర్చుకోలేకపోయారు. తొలి గేమ్‌లో11-7తో ఆధిక్యం కనబరిచిన యువ ద్వయం 21-9తో కైవసం చేసుకుంది. అయితే చైనా జోడీ పుంజుకుని పోటీలోకి రావడంతో వీరు వరుస గేమ్‌లు కోల్పోవాల్సి వచ్చింది. తమ ర్యాంకింగ్‌కు తగ్గట్లు లియాంగ్ వీ, వాంగ్ చాంగ్ చెలరేగడంతో సాత్విక్, చిరాగ్ దగ్గర సరైన సమాధానం లేకపోయింది. పోటీనిచ్చేందుకు ప్రయత్నించినా..అనవసరపు షాట్లతో పాయింట్లు కోల్పోయారు.