షెన్జెన్ (చైనా): ఇటీవల ముగిసిన బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించిన ఊపులో ఉన్న భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోరు కొనసాగుతున్నది. ఈ సీజన్లో తొలి టైటిల్ కోసం వేట సాగిస్తున్న ఈ జోడీ.. వరుసగా రెండో ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
గత వారం హాంకాంగ్ ఓపెన్‌లో ఫైనల్స్ చేరిన ఈ ద్వయం.. తాజాగా చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలోనూ టైటిల్ పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్ పోరులో సాత్విక్-చిరాగ్.. 21-17, 21-14తో మలేషియా జంట ఆరోన్ చియా-సొ వుయ్ యిక్‌పై గెలిచింది. 41 నిమిషాల పాటు సాగిన పోరులో భాగంగా సాత్విక్ ద్వయం తొలి గేమ్‌లో 10-7తో వెనుకబడ్డా మలేషియా జోడీ చేసిన తప్పిదాలను తమకు అనుకూలంగా మలుచుకుని 18-14తో ఆధిక్యంలోకి వెళ్లింది.
వరుసగా 4 పాయింట్లు సాధించడంతో ఆ గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌లో దూకుడు పెంచిన ఈ జోడీ.. ఆరంభం నుంచే వేగంగా ఆడుతూ 8-2 ఆధిక్యాన్ని సాధించింది. స్కోరు 15-9తో ఉండగా మలేషియా ఆటగాళ్లు పుంజుకునే యత్నం చేసి 16-12కు వచ్చినా సాత్విక్ తనదైన స్మాష్‌లతో వారికి అడ్డుకట్ట వేసి మ్యాచ్‌ను ముగించాడు.