షెన్జెన్ (చైనా): ఇటీవలే ముగిసిన హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్‌తో సత్తాచాటిన భారత పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్‌లోనూ జోరు కొనసాగిస్తున్నది. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత జోడీ.. 24-22, 21-13తో జునైది అరిఫ్, రాయ్ కింగ్ యాప్ (మలేషియా)ను మట్టికరిపించింది. 42 నిమిషాల్లోనే ముగిసిన పోరులో వరుస గేమ్స్‌ను గెలుచుకున్న భారత ద్వయానికి ప్రత్యర్థి నుంచి తొలి గేమ్‌లో తీవ్ర పోటీ ఎదురైంది. రెండు జంటలు నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డాయి.
21 నిమిషాల పాటు సాగిన తొలి గేమ్‌ను నెగ్గాక రెండో గేమ్‌లో భారత జోడీ దూకుడు పెంచింది. 11-6తో ఆధిక్యంలో ఉన్న సాత్విక్ జంట.. తర్వాత అలవోకగా మ్యాచ్‌ను ముగించి ప్రిక్వార్టర్స్‌కు చేరింది. కాగా పురుషుల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన లక్ష్యసేన్.. 11-21, 10-21తో జూనియర్ పోపొవ్ (ఫ్రాన్స్) చేతిలో చిత్తయ్యాడు. మిక్స్డ్ డబుల్స్‌లోనూ ధృవ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ.. 19-21, 13-21తో ఫెంగ్ యాన్ ఝె-హువాంగ్ డోంగ్ పింగ్ (చైనా) చేతిలో ఓడింది.