Sarfaraz Khan | తనను జాతీయ జట్టులోకి తీసుకోకపోవడంపై ఆగ్రహంతో ఉన్న యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్.. తన కోపాన్నంతా బంతులపై చూపిస్తున్నాడు. రంజీల్లో మరో సెంచరీ సాధించి తానేంటో సెలక్టర్లకు మరోసారి చాటారు. రంజీ ట్రోఫీలో ఢిల్లీపై 135 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు. ఈ సీజన్లో అతడికిది మూడో సెంచరీ. ఈ సీజన్లో 6 మ్యాచుల్లో 500కు పైగా పరుగులు చేశాడు. మంచి ఫాంలో ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌ను ఆస్ట్రేలియాతో పోటీపడే టెస్టు జట్టులోకి సెలక్టర్లు తీసుకోలేదు. తననెందుకు విస్మరించారో తెలియడం లేదంటూ సోషల్ మీడియాలో తన సెంచరీల ఫొటోలను పోస్ట్ చేస్తూ సర్ఫరాజ్ ఖాన్ ప్రశ్నించడం ఆయన అభిమానులను కలచివేసింది.
రంజీ ట్రోఫీ రౌండ్-6 లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 293 పరుగులకు ఆలౌటైంది. 155 బంతుల్లో 125 పరుగులు చేసి సర్ఫరాజ్ ఖాన్ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 16 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఈయన కాకుండా మరే ముంబై బ్యాట్స్‌మెన్ ఫిఫ్టీ స్కోర్ చేయలేకపోయారు. పృథ్వీ షా 40, షమ్స్ ములానీ 39 పరుగులు మాత్రమే చేశారు. ఢిల్లీ తరఫున ప్రన్షు విజయరన్ 4 వికెట్లు పడగొట్టాడు. యోగేష్ శర్మ, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు తీశారు.
2019 రంజీ ట్రోఫీ సీజన్ నుంచి ముంబై తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ పరుగులు చేస్తూనే ఉన్నాడు. ఆ సీజన్‌లోని 6 మ్యాచ్‌ల్లో 154.66 సగటుతో 928 పరుగులు చేశాడు. వీటిలో 3 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. గత సీజన్‌లోని 6 మ్యాచుల్లో 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు. ఈయన కారణంగా ముంబై ఫైనల్స్‌కు చేరుకుని ఫైనల్లో ఓటమిపాలైంది. అయితే సర్ఫరాజ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌గా ఎంపికయ్యాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఉత్తమ రంజీ క్రికెటర్ అవార్డుతో పాటు 8 వివిధ విభాగాల కింద సత్కరించింది. ప్రస్తుత సీజన్లో అతడి బ్యాటింగ్ నుంచి 301 పరుగుల ఇన్నింగ్స్ కూడా నమోదైంది.