ప్రధాన ఆటగాళ్ల పనిభారం నిర్వహణలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్.. టీ20 క్రికెట్లో ఇప్పటిదాకా మరే భారత క్రికెటర్‌కు సాధ్యం కాని రీతిలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా పర్యటనలో యువ భారత్ బోణీ కొట్టింది. సంజూ, తిలక్ వర్మ దూకుడుతో భారీ స్కోరుచేసిన టీమ్ఇండియా.. ప్రత్యర్థిని కట్టడిచేయడంలోనూ విజయవంతమైంది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ సఫారీలకు చుక్కలు చూపించారు.
Sanju Samson | కింగ్స్‌మీడ్ (డర్బన్): టీమ్ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ (50 బంతుల్లో 107, 7 ఫోర్లు, 10 సిక్సర్లు) శతకంతో కదంతొక్కడంతో దక్షిణాఫ్రికా పర్యటనలో యువ భారత్ బోణీ కొట్టింది. కింగ్స్‌మీడ్ మైదానం వేదికగా ముగిసిన తొలి టీ20లో భారత్ 61 పరుగుల తేడాతో సఫారీలను ఖంగుతినిపించి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. శాంసన్‌తో పాటు తిలక్ వర్మ (18 బంతుల్లో 33, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జి (3/37) రాణించాడు. అనంతరం భారీ ఛేదనలో సఫారీలు.. భారత స్పిన్నర్ల ధాటికి 17.5 ఓవర్లలో 141 పరుగులకే పరిమితమయ్యారు. హెన్రిచ్ క్లాసెన్ (25) టాప్ స్కోరర్. వరుణ్ (3/25), బిష్ణోయ్ (3/28) దక్షిణాఫ్రికాను కట్టడిచేశారు. సంజూ శాంసన్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆది నుంచే వేగంగా ఆడేందుకు యత్నించింది. ఈ వ్యూహాన్ని శాంసన్ పకడ్బందీగా అమలుచేయగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (7) మరోసారి నిరాశపరిచాడు. మార్క్మ్ 4వ ఓవర్లో బౌండరీతో పరుగుల వేట మొదలుపెట్టిన సంజూ.. మహారాజ్ 3వ ఓవర్లో 4, 6తో అతడికి స్వాగతం పలికాడు. క్రీజులోకి రావడంతోనే ఫోర్, సిక్సర్ బాదిన సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో 21, 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో సంజూ మరింత రెచ్చిపోయాడు. జాన్సెన్ 5వ ఓవర్లో 4,6,4 బాదడంతో తొలి పవర్ ప్లే ముగిసేసరికి భారత్ స్కోరు 56/1 చేరింది. ఎంగబా పీటర్ 8వ ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో 27 బంతుల్లోనే సంజూ అర్ధ శతకం పూర్తయింది.
క్రూగర్ 9వ ఓవర్లో ఆఖరి బంతికి సూర్య ఔట్ అవడంతో 37 బంతుల్లోనే 66 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సిమలెన్ 13వ ఓవర్లో రెండు బౌండరీలు, లాంగాఫ్ వద్ద ఓ భారీ సిక్సర్‌తో 90లలోకి వచ్చిన శాంసన్.. మహారాజ్ 15వ ఓవర్లో సింగిల్ తీసి వరుసగా రెండో శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. 47 బంతుల్లోనే అతడి శతకం పూర్తయింది. క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన తిలక్.. ఇదే ఓవర్లో భారీ షాట్ ఆడబోయి డీప్ స్కేర్ లెగ్ వద్ద జాన్సెన్ చేతికి చిక్కాడు. ఆ మరుసటి ఓవర్లో శాంసన్ సైతం పీటర్ బౌలింగ్‌లో స్టబ్స్ చేతికి చిక్కాడు. శాంసన్ ఔట్ అయ్యేటప్పటికీ 16 ఓవర్లలో 175/4గా ఉన్న భారత స్కోరు ఒక దశలో 250 దాకా వెళ్తుందని అభిమానులు ఆశించినా చివరి 4 ఓవర్లలో 27 పరుగులే చేసింది.
కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికాకు ఆరంభం నుంచే కష్టాలు తప్పలేదు. ఆరంభంలో పేసర్లు, మధ్య ఓవర్లలో స్పిన్నర్లు సఫారీలను కట్టడి చేశారు. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన మార్క్మ్ (8) అర్ష్‌దీప్ బౌలింగ్‌లో సంజూకు క్యాచ్ ఇచ్చాడు. అవేశ్ ఖాన్ 4వ ఓవర్లో ప్రమాదకర ట్రిస్టన్ స్టబ్స్ (11)ను పెవిలియన్‌కు పంపాడు. 3 పోర్లు, ఓ సిక్సర్‌తో 11 బంతుల్లోనే 21 రన్స్ రాబట్టిన రికెల్టన్.. వరుణ్ చక్రవర్తి 6వ ఓవర్లో లాంగాన్ వద్ద తిలక్ వర్మ చేతికి చిక్కాడు. ఈ క్రమంలో క్లాసెన్, మిల్లర్ ఆ జట్టును ఆదుకున్నారు. 4 వికెట్‌కు ఈ ద్వయం 42 రన్స్ జతచేశారు. చక్రవర్తి ఒకే ఓవర్లో ఈ ఇద్దరినీ ఔట్ చేసి సఫారీలను కోలుకోలేని దెబ్బతీశాడు. మరుసటి ఓవర్లో బిష్ణోయ్ కూడా క్రూగర్ (1), సిమలెన్ (6)ను పెవిలియన్‌కు పంపాడు. జాన్సెన్ (12)ను బిష్ణోయ్ ఔట్ చేయడంతో సఫారీల ఓటమి ఖరారైంది.
1- పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున రెండు శతకాలు చేసిన ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్ శాంసన్.
2- క్యాలెండర్ ఈయర్‌లో ఏడు సార్లు 200 ప్లస్ స్కోరు చేయడం భారత్‌కు ఇది వరుసగా రెండోసారి.
4 – టీ20లలో వరుసగా రెండు శతకాలు చేసిన ఆటగాళ్లలో శాంసన్ నాలుగోవాడు. గుస్తవ్ మెక్కియోన్, రిలీ రూసో, ఫిల్ సాల్ట్.. సంజూ కంటే ముందున్నారు. భారత్ నుంచి ఈ ఘనత సాధించింది అతడొక్కడే.
భారత్ : 20 ఓవర్లలో 202/8 (శాంసన్ 107, తిలక్ 33, కొయెట్జి 3/37, జాన్సెన్ 1/24)
దక్షిణాఫ్రికా: 17.5 ఓవర్లలో 141 (క్లాసెన్ 25, రెకెల్టన్ 21, వరుణ్ 3/25, బిష్ణోయ్ 3/28)