World Boxing Cup : యూత్ వరల్డ్ ఛాంపియన్ సాక్షి (Sakshi) విశ్వ వేదికపై మరోసారి తన పంచ్ పవర్ చూపించింది. అస్తానా వేదకగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్(World Boxing Cup)లో స్వర్ణం కొల్లగొట్టింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో యొస్లినే పెరెజ్(అమెరికా) మట్టికరిపించిన 24 ఏళ్ల సాక్షి దేశానికి తొలి పసిడి అందించింది. అయితే.. మరో ముగ్గురు బాక్సర్లు మాత్రం నిరాశపరిచారు. మీనాక్షి(48 కిలోలు), పూజా రాణి(80 కిలోలు), జుగ్నూ(85 కిలోలు)లు రజతంతో సరిపెట్టుకున్నారు.
బ్రెజిల్ వేదికగా జరిగిన మొదటి వరల్డ్ బాక్సింగ్ కప్ ఎడిషన్‌లో ఒకే ఒక పసిడి, రజతంతో తిరిగొచ్చింది భారత బృందం. కానీ, ఈసారి మాత్రం మన బాక్సర్లు అమితంగా రాణించి 11 పతకాలు ఖాయం చేశారు. 54 కిలోల విభాగంలో వరుసగా ప్రత్యర్థులను చిత్తు చేసిన సాక్షి పసిడి పోరులో యొస్లినే పెరెజ్‌పై అటాకింగ్ గేమ్‌తో విరుచుకుపడింది. పదునైన పంచ్‌లతో అమెరికా బాక్సర్‌ను ఓడించి పసిడి పతకంతో దేశం గర్వపడేలా చేసింది సాక్షి.
GOLDEN GIRL 🇮🇳 Sakshi wins Gold in the 54KG Category at the World Boxing Cup in Kazakhstan with a unanimous decision win over her American opponent.#IndianBoxing #Sakshi #India #WorldBoxingCup #BFI #FightNews #Bharat pic.twitter.com/fZP8jOvJw7
— LockerRoom (@lockerroom_in) July 6, 2025
సాయంత్రం మరో నలుగురు బాక్సర్లు గోల్డ్ మెడల్ కోసం పోటీపడనున్నారు. పురుషుల విభాగంలో హితేశ్ గులియా(70 కిలోలు), అభినాష్ జమ్వల్(65 కిలోలు), మహిళల కేటగిరీలో జాస్మినే(57 కిలోలు), నుపుర్( 85 ప్లస్ కిలోలు) బంగారు పతకంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు సిద్ధమయ్యారు.