హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్(హెచ్పీఎల్)లో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ భాగం కాబోతున్నది. ఎనిమిది జట్ల కలయికతో అక్టోబర్ 10 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు జరుగనున్న లీగ్‌లో కీర్తి వారియర్స్ టీమ్‌కు సైనా సహ యజమానిగా వ్యవహరించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘పికిల్‌బాల్‌కు దేశంలో మెండైన ఆదరణ కనిపిస్తున్నది. గతంలో బ్యాడ్మింటన్‌కు ఏ స్థాయిలో ఉందో ప్రస్తుతం పికిల్‌బాల్ అదే కోవలో ఉంది.
దేశం మొత్తం విస్తరించేందుకు పికిల్‌బాల్‌కు మంచి అవకాశముంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు, యువకులకు పికిల్‌బాల్ ద్వారా వారి ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్ క్రీడా సంస్కృతిలో నేను కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొంది. ఈ కార్యక్రమంలో కీర్తి ఏస్టేట్స్ నుంచి కీర్తిరెడ్డి, విక్రాంత్ పాల్గొన్నారు.