Sai Sudharshan: టీమిండియా యువ ఓపెనర్ సాయి సుదర్శన్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జోహన్నస్బర్గ్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో అతడు.. 43 బంతుల్లోనే 9 బౌండరీల సాయంతో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సఫారీలు నిర్దేశించిన 117 పరుగుల ఛేదనలో సాయి.. శ్రేయస్ అయ్యర్ (52)తో కలిసి రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించి టీమిండియా ఈజీ విక్టరీ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీ చేయడం ద్వారా సాయి.. వన్డే క్రికెట్లో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
భారత్ తరఫున తొలి వన్డే ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించినవారిలో సాయి 17వ బ్యాటర్ కాగా ఓపెనర్‌గా మాత్రం నాలుగోవాడు. గతంలో రాబిన్ ఊతప్ప, కెఎల్ రాహుల్, ఫియాజ్ ఫజల్‌లు ఆడిన తొలి వన్డేలోనే (ఓపెనర్లుగా) ఫిఫ్టీ ప్లస్ స్కోరు సాధించారు. ఆ జాబితాలో తాజాగా ఈ తమిళనాడు బ్యాటర్ సైతం చేరాడు. రాబిన్ ఊతప్ప.. 2006లో ఇంగ్లండ్‌పై అరంగేట్ర మ్యాచ్‌లో 86 పరుగులు చేయగా కెఎల్ రాహుల్ 2016లో జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో 100 పరుగులు చేయడం విశేషం. ఫియాజ్ ఫజల్ కూడా కూడా జింబాబ్వేపైనే (2016లో) 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సాయి నాలుగో స్థానంలో నిలిచాడు.
#SaiSudarshan announces his arrival in ODIs with a cracking cover drive!
Tune-in to the 1st #SAvIND ODI
LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/c2ZSO0pb4Y— Star Sports (@StarSportsIndia) December 17, 2023
తమిళనాడుకు చెందిన ఈ 22 ఏండ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గత రెండేండ్లుగా దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇక గతేడాది నుంచి ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. 2022 సీజన్లో గుజరాత్ తరఫున ఆడింది ఐదు మ్యాచ్‌లే అయినా 145 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఏకంగా 13 మ్యాచ్‌లు ఆడి 46.09 సగటుతో ఏకంగా 507 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ మ్యాచ్‌లలో కూడా సాయి నిలకడగా ఆడుతున్నాడు.