ఇనుగుర్తి, ఏప్రిల్ 12 : జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థిని బొల్లు సహస్ర ఎంపికైంది. దీనికి సంబంధించిన వివరాలను ఎంఈవో రూపారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇనుగుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని సహస్ర ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో వరంగల్ తరఫున ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.
ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే జాతీయ సాఫ్ట్బాల్ టోర్నీలో రాష్ట్రం నుంచి సహస్ర పాల్గొంటున్నట్లు రూపారాణి తెలిపారు. సహస్రను పాఠశాల పీడీ తాళ్ల ప్రణయ్, ఉపాధ్యాయులు అభినందించారు.