Viral Video: అంతర్జాతీయ క్రికెట్లో దూకుడుకు మారుపేరుగా ఉండే ఆస్ట్రేలియా తమ గెలుపులో ప్రత్యర్థి జట్లపై చేసే ‘స్లెడ్జింగ్’ కు అధిక ప్రాధాన్యతనిచ్చేది. ఆధునిక క్రికెట్లో కాస్త తగ్గింది గానీ స్టీవ్ వా, రికీ పాంటింగ్‌ల హయాంలో.. ముఖ్యంగా 1990, 2000వ దశకంలో స్లెడ్జింగ్ లేకుండా ఆసీస్ మ్యాచ్ ముగించలేదంటే అతిశయోక్తి కాదు. ఈ విధానం ఆసీస్ జట్టులో 12వ ఆటగాడని కూడా అప్పట్లో క్రికెట్ విశ్లేషకులు వాదనలు వినిపించారు. తాజాగా ఓ బుడ్డ కెప్టెన్‌తో పాటు టీమ్ మొత్తం.. ప్రత్యర్థులను ఆది నుంచే స్లెడ్జింగ్ చేద్దామని, ఎవ్వర్నీ వదిలే ప్రసక్తే లేదని చెబుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
మ్యాచ్ ఆరంభానికి ముందు తన జట్టుతో కలిసి చర్చిస్తున్న కెప్టెన్.. ‘మొత్తం జట్టును స్లెడ్జింగ్ చేద్దాం.. ఎవ్వర్నీ వదిలే ప్రసక్తే లేదు. మిస్ ఫీల్డ్ చేసినా బౌలర్ సరిగ్గా బౌలింగ్ వేయకున్నా స్లెడ్జింగ్ చేద్దాం. అందరూ కెప్టెన్ చెప్పినట్టే వినాలి.. ఓకేనా.. మ్యాచ్ ఆరంభం నుంచే స్లెడ్జింగ్ మొదలుపెడదాం..’ అంటూ చెప్పిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Sab sledging karenge 😂 pic.twitter.com/ampBlmmFLW
— Cricketopia (@CricketopiaCom) January 1, 2024
ఆస్ట్రేలియా స్థాయిలో కాకపోయినా భారత క్రికెట్ జట్టు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో దూకుడుగా వ్యవహరించింది. అంతకుముందు ప్రత్యర్థులు తమను స్లెడ్జింగ్ చేసినా పట్టించుకోని భారత ఆటగాళ్లు.. కోహ్లీ కెప్టెన్సీలో మాత్రం ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయికి వెళ్లారు. అనవసరమైన గొడవలకు పోకుండా తమను ఎవరైనా ఏమైనా అంటే గట్టి సమాధానమివ్వడంలో కోహ్లీ జట్టును మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. ఈ అగ్రెసివ్ ఆటతోనే భారత్.. ఆస్ట్రేలియాలో వరుసగా రెండు టెస్టు సిరీస్ (బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ) లను గెలుచుకుంది.