Mohammed Siraj | సుదీర్ఘ(146 ఏండ్లు) టెస్టు క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం. ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని సందర్భం. పేస్‌కు స్వర్గధామమైన కేప్‌టౌన్ పిచ్‌పై భారత్, దక్షిణాఫ్రికా పేసర్లు వికెట్ల వేట కొనసాగించారు. సఫారీలో జంతువులను వేటాడినట్లు పేసర్లు తమ విశ్వరూపం ప్రదర్శించారు. ఫలితంగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మొదటి రోజే లెక్కకు మిక్కిలి రికార్డులు బద్దలయ్యాయి.
తొలుత హైదరాబాదీ షాన్ మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్ల విజృంభణతో వికెట్ల వేటకు లైన్ వేశాడు. సూపర్ స్వింగ్ బౌలింగ్‌తో సఫారీ బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తూ వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మియాభాయ్కు తోడు బుమ్రా, ముకేశ్ తోడవ్వడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలింది. టెస్టుల్లో భారత్‌పై సఫారీలకు ఇదే అత్యల్ప స్కోరు.
కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో సాఫీగా సాగుతున్న టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 11 బంతుల్లో ఆఖరి ఆరు వికెట్లు కోల్పోయింది. పరుగులేమి లేకుండానే వికెట్లు చేజార్చుకుని చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి భారత స్కోరుకు 36 పరుగుల దూరంలో ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా ఆట మూడో రోజుకు పోవడం అసాధ్యం అనిపిపిస్తున్నది.
కేప్‌టౌన్: కేప్‌టౌన్‌లో సఫారీల వేట! దక్షిణాఫ్రికా గడ్డపై భారత పేసర్లు దుమ్మురేపారు. తొలి టెస్టులో భారీ ఓటమి నుంచి అనూహ్యంగా పుంజుకున్న రోహిత్‌సేన..సఫారీలపై బెబ్బులిలా విరుచుకుపడింది. ఆకలిగొన్న పులిలా దొరికింది దొరికినట్లు నిర్దాక్షిణ్యంగా వేటాడింది. ఈ వేటకు మన హైదరాబాదీ యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ నాయకత్వం వహిస్తే..బుమ్రా, ముకేశ్‌కుమార్ మిగతా పనిని పూర్తి చేశారు.
తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఎవరూ ఊహించని రీతిలో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పచ్చికతో కళకళలాడుతున్న పిచ్‌పై మన పేసర్లు ముఖ్యంగా సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఇన్‌స్వింగ్, ఔట్‌స్వింగ్, పుల్, గుడ్ లెంగ్త్ బంతులతో సఫారీ బ్యాటింగ్ నడ్డివిరిచాడు. ఓపెనర్ మార్క్మ్(్ర2)తో మొదలైన సిరాజ్ వికెట్ల పర్వం ఆఖరి వరకు దిగ్విజయంగా కొనసాగింది. ఎంతలా అంటే లంచ్ విరామసమయానికే సిరాజ్ తన ఖాతాలో ఐదు వికెట్లు వేసుకునేలా. 92 ఏండ్ల దేశ టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ అందుకున్న బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.
గత మ్యాచ్‌లో సెంచరీతో మ్యాచ్‌ను శాసించిన కెప్టెన్ ఎల్గర్(4)ను సిరాజ్ అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. ఆఫ్‌సైడ్ ఆఫ్‌స్టంప్ అవతల బంతిని ఎల్గర్ వికెట్ల మీదకు ఆడుకుని మూల్యం చెల్లించుకున్నాడు. ఆ తర్వాత టోనీ డీ జార్జి(2), బెడింగ్హామ్(12), జాన్సెన్(0), కైల్ వెరైన్(15)ను సిరాజ్ పెవిలియన్ పంపాడు. దీంతో తన టెస్టు కెరీర్లో తొలి సారి ఆరు వికెట్లు దక్కించుకున్నాడు. సిరాజ్, బుమ్రా, ముకేశ్ ధాటికి దక్షిణాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కూప్పకూలింది. నిషేధం పునరుద్ధరణ తర్వాత టెస్టుల్లో సఫారీలకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. బెడింగ్హామ్, వెరైన్ మినహా మిగతా బ్యాటర్లు అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.

11 బంతులు 6 వికెట్లు, 0 పరుగులు:
సఫారీలను స్వల్ప స్కోరుకు పరిమితం చేసిన భారత్ తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(0) డకౌట్‌గా వెనుదిరిగినా.. కెప్టెన్ రోహిత్‌శర్మ(39) ధాటిగా ఆడాడు. రోహిత్‌కు తోడు గిల్(36), విరాట్ కోహ్లీ(46) రాణించడంతో ఒక దశలో టీమ్ఇండియా మెరుగ్గా కనిపించింది. శ్రేయాస్ అయ్యర్ (0) నిరాశపరిచినా..కోహ్లీ, రాహుల్ ఇన్నింగ్స్‌ను కొనసాగించే ప్రయత్నం చేశారు.
కానీ ఎంగ్డీ (3/30) రంగ ప్రవేశంతో సీన్ పూర్తిగా మారిపోయింది. తొలుత రాహుల్(8) అనవసరపు షాట్‌కు ఔట్ కాగా, ఆ తర్వాత జడేజా (0), బుమ్రా(0), కోహ్లీ, సిరాజ్ (0), ప్రసిద్ధ్ కృష్ణ(0) వరుస విరామాల్లో వికెట్లు సమర్పించుకున్నారు. అప్పటి వరకు 153/4 సాఫీగా కనిపించిన ఇన్నింగ్స్ 11 బంతుల వ్యవధిలో ఆఖరి ఆరు వికెట్లు కోల్పోయింది. పరుగులేమి లేకుండానే ఇన్ని వికెట్లు కోల్పోవడం టెస్టుల్లో ఇదే తొలిసారి.
ఒకే రోజు 23 వికెట్లు
153 పరుగులకు భారత్‌ను ఆలౌట్ చేసిన దక్షిణాఫ్రికా తొలి రోజే మరోమారు బ్యాటింగ్‌కు దిగింది. 98 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు మొదటి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేశారు. ఓపెనర్ మార్క్మ్(్ర36), బెడింగ్హామ్(7) క్రీజులో ఉన్నారు. ముకేశ్‌కుమార్(2/25), బుమ్రా(1/25) రాణించారు. కెప్టెన్ డీన్ ఎల్గర్(12) తన ఇన్నింగ్స్‌లో ఆఖరి ఆట ఆడేశాడు. ముకేశ్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న సఫారీలు ఇంకా 36 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నారు.
1 ఓవరాల్‌గా టెస్టుల్లో ఇప్పటి వరకు పరుగులు చేయకుండా ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ చెత్త రికార్డును భారత్ తన పేరిట లిఖించుకుంది.
1 2011 తర్వాత టెస్టుల్లో తొలి సెషన్లో ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. సిరాజ్ కంటే ముందు 1986-87లో పాకిస్థాన్‌పై బెంగళూరులో మణిందర్‌సింగ్ ఈ ఫీట్ నమోదు చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 55 ఆలౌట్(వెరైన్ 15, సిరాజ్ 6/15), భారత్ తొలి ఇన్నింగ్స్: 153 ఆలౌట్(కోహ్లీ 46, ఎంగ్డీ 3/30), దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 62/3(మార్క్మ్ 36 నాటౌట్, ముకేశ్ 2/25)
దక్షిణాఫ్రికాలో భారత బౌలర్ల మెరుగైన ప్రదర్శన
శార్దుల్ ఠాకూర్ : (7/61)-2022
హర్భజన్‌సింగ్: (7/120)-2011
సిరాజ్ : (6/15)-2024
టెస్టుల్లో భారత్‌పై అత్యల్ప స్కోర్లు
దక్షిణాఫ్రికా : (55 ఆలౌట్)-2024
న్యూజిలాండ్ : (62 ఆలౌట్)-2021
దక్షిణాఫ్రికా : (79 ఆలౌట్)-2015