Asia Games 2023 : ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్(Asia Games)లో రష్యా(Russia), బెలారస్(Belarus) దేశాలకు చెందిన ఆటగాళ్లు తటస్థంగా పోటీపడనున్నారు. వాస్తవానికి వాళ్లు తమ తమ దేశాల తరఫున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. కానీ, ఉక్రెయిన్(Ukraine)పై రష్యా ముమ్మర దాడులకు నిరసనగా అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(IOC) ఈ నిర్ణయం తీసుకుంది. చైనా వేదికగా సెప్టెంబర్‌లో జరుగనున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి రష్యా, బెలారస్ నుంచి 500 మందికి మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
గత శనివారం బ్యాంకాక్ వేదికగా సమావేశమైన ఆసియా ఒలింపిక్ కౌన్సిల్(OCA).. రష్యా, బెలారస్ దేశాల అథ్లెట్ల పోటీపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ రెండు దేశాలకు చెందిన అథ్లెట్లు తటస్థ పతాకం కింద వ్యక్తిగతంగా పోటీపడాల్సి వస్తుందని వోసీఏ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ అల్ ముసల్లామ్(Husain AHZ Al-Musallam) స్పష్టం చేశాడు. అయితే.. తటస్థ ప్రాతినిధ్యమనేది వ్యక్తిగతంగా మాత్రమే ఉంటుందని, ఇది జట్లకు వర్తించదని ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
వోసీఏ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ అల్ ముసల్లామ్
అంతేకాదు.. ఆసియా గేమ్స్ జరుగుతుండగా యుద్ధానికి మద్దతుగా గానీ లేదా వ్యతిరేకంగా గానీ ఎలాంటి గుర్తులు ప్రదర్శించరాదని రష్యా, బెలారస్ ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ రెండు దేశాల నుంచి ఆసియా గేమ్స్‌కు రాజకీయ నాయకులను ఆహ్వానించడం లేదని నిర్వాహకులు తెలిపారు. కరోనా వైరస్(Corona Virus) విజృంభణ కారణంగా ఏడాది ఆలస్యంగా ఆసియా గేమ్స్ జరుగుతున్నాయి. ఈ పోటీల్లో వివిధ దేశాల నుంచి దాదాపు 10 వేల మంది ఆటగాళ్లు బరిలోకి దిగే అవకాశముంది.