రూ.2,200 కోట్ల నష్టం.. భారత్, పాక్ మ్యాచ్ రద్దు భారం
త్వరలో ప్రారంభం కావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను ఆడబోమని చెప్పిన పాకిస్థాన్ నిర్ణయం ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. దాయాదుల పోరు రైద్దెతే సుమారు 250 మిలియన్ల యూఎస్ డాలర్లు (రూ.2,200 కోట్లు) నష్టం వాటిల్లుతుందని క్రికెట్, వాణిజ్య వర్గాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టం
- అయినా తామేం చేయలేమంటున్న పీసీబీ
- ఐసీసీ నిర్ణయంపై ఉత్కంఠ
ఢిల్లీ : త్వరలో ప్రారంభం కావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను ఆడబోమని చెప్పిన పాకిస్థాన్ నిర్ణయం ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. దాయాదుల పోరు రైద్దెతే సుమారు 250 మిలియన్ల యూఎస్ డాలర్లు (రూ.2,200 కోట్లు) నష్టం వాటిల్లుతుందని క్రికెట్, వాణిజ్య వర్గాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ఉండే క్రేజ్, హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఐసీసీ నిర్వహించే ప్రధాన టోర్నీల్లో ఈ రెండు జట్లు ఆడే మ్యాచ్‌లకే సుమారు సగానికి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశమున్న తరుణంలో పాక్ తీసుకున్న నిర్ణయం ఐసీసీని సందిగ్ధంలో పడేసింది. ప్రధానంగా బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్షిప్, ప్రకటనలు, టికెట్ల రూపంలో ఆదాయం రానుండగా మ్యాచ్ రద్దుతో అవన్నీ కోల్పోవాల్సి వస్తుంది.
బ్రాడ్కాస్టర్లకు దెబ్బ
ప్రపంచకప్‌లో సగటున ఒక మ్యాచ్ విలువ రూ.138 కోట్లుగా అంచనా వేస్తుండగా చిరకాల ప్రత్యర్థుల పోరుకు వచ్చేసరికి అది రూ.300 కోట్ల పైమాటే. దాయాదుల పోరు అంటేనే పది సెకన్ల యాడ్‌కు రూ.30 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఉంటుందని ఒక అంచనా. భారత్, పాక్ ఆడకుంటే బ్రాడ్కాస్టర్లు (స్టార్, జియో హాట్‌స్టార్) ఈ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోతారు. దీని ప్రభావం ఇతర మ్యాచ్‌లపైనా పడే అవకాశం లేకపోలేదు. తద్వారా వారికి సుమారు రూ.400 కోట్ల నష్టాలు వాటిల్లే అవకాశమున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్ నుంచి ప్రకటన వెలువడిన వెంటనే జియో.. ఈ విషయంలో తమకు వాటిల్లబోయే నష్టాలపై ఇప్పటికే ఐసీసీ తలుపు తట్టినట్టు సమాచారం.
ఆదాయంలో కోత?
టోర్నీ నిబంధనలను పాకిస్థాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఆ నష్టాన్ని (సుమారు రూ.400 కోట్లు) ఐసీసీ భరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఐసీసీ ఆ నష్టాన్ని భరించినా సభ్యదేశాలకు పంచే ఆదాయంలో గణనీయంగా కోత పెడుతుంది. అయితే ఇప్పటికే ఆర్థికంగా బలంగా ఉన్న బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, ఆస్ట్రేలియా వంటి బోర్డులకు ఇదేం పెద్ద సమస్య కాకపోయినా చిన్నదేశాలకు మాత్రం ఇది భారీ నష్టమే కానుంది.
పాక్‌కే ఎక్కువ నష్టం!
పాక్ తీరుతో ఐసీసీ, ఇతర సభ్య దేశాల కంటే ఆ దేశానికే ఎక్కువ నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ జట్టు ఆటగాళ్ల జీతాలు, వేతనాల్లో భారీగా కోత పెట్టింది. గడిచిన నాలుగైదు ఏండ్లలోనే విదేశీ జట్లు ఆ దేశంలో పర్యటిస్తున్నాయి. ఈ మ్యాచ్ రైద్దెతే (?) భారత్, పాక్‌కు తలా రూ. 200 కోట్ల నష్టం ఉండనుంది. బీసీసీఐకి ఇది పెద్ద సమస్యే కాదు. కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది భారీ ఎదురుదెబ్బే. ఒకవేళ పీసీబీ గనుక ఇదే విధానాన్ని (భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ) కొనసాగిస్తే ఐసీసీ నుంచి కఠిన ఆంక్షలు ఎదురుకోక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ జట్టును టోర్నీ నుంచి పూర్తిగా బహిష్కరించడం, ఐసీసీ వార్షికాదాయంలో కోత పెట్టడం, జియో-స్టార్‌కు పూర్తి నష్టపరిహారం అందించాలని పీసీబీపై ఐసీసీ ఒత్తిడి తెచ్చే అవకాశంతో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు, డబ్ల్యూటీసీ పాయింట్ల విషయంలోనూ పాక్‌పై కఠిన ఆంక్షలు విధించే ప్రమాదం లేకపోలేదు. అదీగాక ఆ దేశంలో జరిగే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో విదేశీ ఆటగాళ్లపై నిషేధం విధించవచ్చు.
మేం ఏమీ చేయలేం..
పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై తామేమీ చేయలేమని పీసీబీతో పాటు పాక్ జట్టు సారథి సల్మాన్ అలీ అఘా నిస్సహాయత వ్యక్తం చేశాడు. కొలంబో బయల్దేరడానికంటే ముందు కరాచీలో తమను కలిసిన విలేకరులతో అతడు మాట్లాడుతూ.. ‘మేం బోర్డుతో కాంట్రాక్టు కుదుర్చుకున్న ఆటగాళ్లం మాత్రమే. మా ప్రభుత్వం, బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటే మేం దానికి కట్టుబడి ఉంటాం’ అని అన్నాడు. ఈ విషయంలో పీసీబీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరిస్తామని బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Broadcasters
- ICC
- India
- Pakistan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

