రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి అద్భుతం చేసింది.! ఐపీఎల్లో అద్వితీయ ప్రదర్శనతో జూలు విదిల్చింది! అసమాన పోరాట పటిమతో మెగా టోర్నీలో రెండోసారి విజేతగా నిలిచింది. తొలి కప్పు కోసం ఏకంగా 18 ఏండ్లు సుదీర్ఘ పోరాటం చేసిన ఆ జట్టు.. రెండో ట్రోఫీని మాత్రం మరొక్క ఏడాదిలోనే సగర్వంగా ముద్దాడింది.
గతేడాది విజయోత్సవాల విషాదం ఏడాదంతా వెంటాడుతున్నా, డిఫెండింగ్ చాంపియన్‌గా సొంతగడ్డ ‘చిన్నస్వామి’లో ఫైనల్ ఆడే అవకాశం కోల్పోయినా బెంగళూరు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. గుజరాత్ టైటాన్స్‌తో నరాలు తెగే ఉత్కంఠ తప్పదనుకున్న టైటిల్ పోరును.. తమ కసి, పట్టుదలతో పూర్తిగా ఏకపక్షం చేసింది. తొలి నాలుగు ఓవర్లలోనే ఓపెనర్లను పెవిలియన్‌కు పంపి ప్రత్యర్థి నడ్డి విరిచిన బౌలర్లు మ్యాచ్‌ను వన్ సైడ్ చేశారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ ఖతర్నాక్ ఆరంభం ఇవ్వగా.. దానికి ఛేజ్ కింగ్ విరాట్ కోహ్లీ తన బ్యాట్ పవర్‌ను జత చేశాడు. బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విరాట్ సృష్టించిన విధ్వంసంతో ఆ చిన్న టార్గెట్‌ను ఆర్సీబీ ఆడుతూ పాడుతూ ఛేదించింది.
లీగ్ దశ నుంచి సమష్టిగా కదం తొక్కుతూ టాపర్‌గా నిలిచిన బెంగళూరు అదే జోరును ఫైనల్లోనూ కొనసాగిస్తూ మెగా లీగ్‌లో టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకున్న మూడో జట్టు ముంబై, సీఎస్కే సరసన సగర్వంగా నిలిచింది. ఒకప్పుడు కప్పుల కరువుతో విమర్శలు ఎదుర్కొన్న చోటే సింహంలా గర్జించి.. వరుసగా రెండో ఏడాది విజేతగా అవతరించింది. తమను ఆరాధించే కోట్లాది మంది అభిమానుల ఆనందాన్ని రెండింతలు చేసింది.
అహ్మదాబాద్: బెంగళూరు మరోసారి చాంపియన్ అయింది. టోర్నీ ఆరంభం నుంచే అదరగొడుతూ.. లీగ్ టాపర్‌గా నిలిచిన ఆ జట్టునే ఐపీఎల్ కిరీటం వరించింది. తమ మాదిరిగా రెండో ట్రోఫీ వేటలో ఉన్న మాజీ విజేత గుజరాత్ టైటాన్స్ దాని సొంతగడ్డపై చిత్తు చేసింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ ఫైట్‌లో తమకు మద్దతుగా ఎరుపు వర్ణం జెండాలు, జెర్సీలతో నిండిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెప్పించిన బెంగళూరు 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించి టైటిల్ నిలబెట్టుకుంది. తొలుత రసిఖ్ సలామ్ దార్ (3/27), భువనేశ్వర్ (2/29), హేజిల్‌వుడ్ (2/37) బుల్లెట్లలాంటి బంతులు వేయడంతో గుజరాత్ 20 ఓవర్లలో 155/8 స్కోరు మాత్రమే చేసింది. వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 5 ఫోర్లతో 50 నాటౌట్) ఫిఫ్టీతో పోరాడాడు. అనంతరం కింగ్ కోహ్లీ (42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 నాటౌట్) ముందుండి నడిపించడంతో చిన్న లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించాడు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఆతిథ్య గుజరాత్ బ్యాటింగ్‌కు గుండెకాయలాంటి ఓపెనర్లను ఆరంభంలోనే వెనక్కపంపిన ఆర్సీబీ బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ పాటిదార్ నిర్ణయానికి పూర్తి న్యాయం చేశారు. రెడ్, బ్లాక్ సాయిల్‌తో కూడిన పిచ్‌ను అర్థం చేసుకొని సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేశారు. మూడో ఓవర్లో హేజిల్‌వుడ్ 141 కి.మీ వేగంతో సంధించిన షార్ట్ పిచ్ బాల్‌ను కెప్టెన్ గిల్ (10) పుల్ షాట్ ఆడబోయి పాటిదార్‌కు చిక్కగా.. తర్వాతి ఓవర్లోనే భువనేశ్వర్ బౌన్సర్‌ను వెంటాడిన సుదర్శన్ (12) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు 26 పరుగులకే డగౌట్ చేరిన తర్వాత టైటాన్స్ పుంజుకోలేకపోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన నిశాంత్ (20).. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు, రసిఖ్ బౌలింగ్‌లో ఓ బౌండరీతో పవర్ ప్లేను 45/2తో ముగించాడు. కానీ, ఫీల్డింగ్ మారిన తర్వాత స్పిన్నర్ కృనాల్, పేసర్లు రసిఖ్, డఫీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వరుసగా ఆరు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. రసిఖ్ వేసిన ఎనిమిదో ఓవర్లో భారీ షాట్‌కు ట్రై చేసిన నిశాంత్.. లైన్ వద్ద పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఈ దశలో సుందర్ ఇన్నింగ్స్‌ను సరిచేసే బాధ్యత తీసుకోగా.. బంతితో పరుగు కూడా చేయలేకపోతున్న బట్లర్ (19)ను కృనాల్ స్టంపౌట్ చేయడంతో గుజరాత్ 73/4తో మరింత డీలా పడింది. కొత్తగా క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్ (15) రెండు సిక్సర్లు, సుందర్ రెండు ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్‌కు చలనం తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, ఆర్సీబీ బౌలర్లు అస్సలు తగ్గలేదు. 15వ ఓవర్లో రసిఖ్ పట్టిన క్యాచ్‌తో అర్షద్‌ను హేజిల్‌వుడ్ ఔట్ చేయగా.. హిట్టర్ తెవాటియా (7) నిరాశపరిచాడు. అయితే, చివర్లో సుందర్ విలువైన రన్స్ అందించాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అతను రెండు ఫోర్లు, హోల్డర్ (7) ఓ బౌండరీ రాబట్టడంతో 16 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో సిక్స్ కొట్టిన రషీద్ ఖాన్ (7) వెంటనే ఔటైనా ఆఖరి బాల్‌కు సింగిల్ తీసిన సుందర్ ఫిఫ్టీ పూర్తి చేసుకొని జట్టుకు గౌరవప్రద స్కోరు అందించాడు.
బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడి చేసిన పిచ్‌పై కింగ్ కోహ్లీ బ్యాట్‌తో చెలరేగడంతో ఛేదనలోనూ ఆర్సీబీ హవానే నడిచింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన వెంకటేశ్ ఉన్నది కొద్దిసేపే అయినా ఫుల్ ఇంపాక్ట్ చూపెట్టాడు. తొలి ఓవర్లోనే కాలి కండరాలు పట్టేయడంతో కుంటుతూ కనిపించిన వెంకీ.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. రబాడ వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లు, సిక్స్‌తో 18 రన్స్ పిండుకున్నాడు. మరో ఎండ్‌లో కోహ్లీ తన మార్కు స్టయిలిష్ షాట్లతో అలరించాడు. సిరాజ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు రాబట్టిన అతను రబాడ వేసిన నాలుగో ఓవర్లో 4, 4, 6,4తో స్టేడియాన్ని హోరెత్తించాడు. సిరాజ్ బౌలింగ్‌లో ఓ సిక్స్ కొట్టిన వెంకీ ఇంకో షాట్‌కు ట్రై చేసి క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌కు 62 రన్స్ భాగస్వామ్యం ముగిసింది.
వన్‌డౌన్‌లో వచ్చిన పడిక్కల్ (1)ను రబాడ వెంటనే ఔట్ చేసినా ఆరో ఓవర్ చివరి బాల్‌కు సిక్స్ కొట్టిన కోహ్లీ పవర్ ప్లేను 70/2తో ముగించాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ (15) ఓ సిక్స్, ఫోర్‌తో దూకుడు చూపడంతో ఆర్సీబీ ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ, తొమ్మిదో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన స్పిన్నర్ రషీద్ నాలుగు బంతుల తేడాలో పాటిదార్‌ను బౌల్డ్, కృనాల్ పాండ్యా (2)ను ఎల్బీ చేసి జీటీ శిబిరంలో ఆశలు రేపాడు. కానీ, అప్పటికే క్రీజులో కుదురుకున్న కోహ్లీ ప్రత్యర్థికి ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న విరాట్.. టిమ్ డేవిడ్ (24) తోడుగా లక్ష్యాన్ని కరిగించాడు. మూడు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టిన డేవిడ్ గెలుపు ముంగిట వెనుదిరిగినా.. జితేశ్ (11నాటౌట్) తోడుగా కోహ్లీ లాంఛనం పూర్తి చేశాడు. అర్షద్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్‌తో మ్యాచ్ ముగించడంతో ఆర్సీబీ సంబరాలు మొదలయ్యాయి.
3 ఐపీఎల్లో వరుసగా రెండోసారి విజేతగా నిలిచిన మూడో టీమ్ ఆర్సీబీ. గతంలో చెన్నై(2010, 11), ముంబై(2019, 20) ఈ ఘనత సాధించాయి.
3 ఐపీఎల్లో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన మూడో కెప్టెన్‌గా రజత్ పాటిదార్. ధోనీ(చెన్నై), రోహిత్‌శర్మ(ముంబై) ముందున్నారు.
2 ఐపీఎల్ ఫైనల్లో తక్కువ(25) బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన రెండో బ్యాటర్ కోహీ. రైనా, వార్నర్, వెంకటేశ్ అయ్యర్ (24 బంతుల్లో)
ముందంజలో ఉన్నారు.
8 గత ఎనిమిది ఐపీఎల్ సీజన్లలో క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది.
1 ఒక సీజన్లో ఒకే టీమ్‌లో ఇద్దరు బ్యాటర్లు 700కు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. గుజరాత్ ఓపెనర్లు గిల్(732), సాయి సుదర్శన్(722) ఈ ఫీట్ సాధించారు.
ఆర్సీబీ రూ.20
జీటీ రూ.12.5 కోట్లు
గుజరాత్: సుదర్శన్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 12, గిల్ (సి) పాటిదార్ (బి) హేజిల్‌వుడ్ 10, నిశాంత్ (సి) పడిక్కల్ (బి) రసిఖ్ సలామ్ 20, బట్లర్ (స్టంప్డ్/ జితేశ్) (బి) కృనాల్ 19, సుందర్ (నాటౌట్) 50, అర్షద్ ఖాన్ (సి) రసిఖ్ (బి) హేజిల్‌వుడ్ 15, తెవాటియా (సి) పాటిదార్ (బి) రసిఖ్ 7, హోల్డర్ (సి) హేజిల్‌వుడ్ (బి) భువనేశ్వర్ 7, రషీద్ ఖాన్ (సి) షెపర్డ్ (బి) రసిఖ్ 7, రబాడ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 155/8; వికెట్ల పతనం: 1-22, 2-26, 3-55, 4-73, 5-99, 6-115, 7-142, 8-151; బౌలింగ్: జాకబ్ డఫీ 4-0-38-0, భువనేశ్వర్ 4-0-29-2, హేజిల్‌వుడ్ 4-0-37-2, రసిఖ్ సలామ్ 4-0-27-3, కృనాల్ పాండ్యా 4-0-23-1.
బెంగళూరు: వెంకటేష్ అయ్యర్ (సి) రబాడ (బి) సిరాజ్ 32, విరాట్ (నాటౌట్) 75, పడిక్కల్ (సి) అర్షద్ ఖాన్ (బి) రబాడ 1, పాటిదార్ (సి) రబాడ (బి) రషీద్ 15, కృనాల్ (ఎల్బీ) రషీద్ 1, టిమ్ డేవిడ్ (సి) బట్లర్ (బి) అర్షద్ ఖాన్ 24, జితేశ్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 18 ఓవర్లలో 161/5; వికెట్ల పతనం: 1-62, 2-63, 3-89, 4-91, 5-132; బౌలింగ్: సిరాజ్ 4-0-36-1, రబాడ 3-0-44-1, హోల్డర్ 2-0-16-0, రషీద్ 4-0-25-2, అర్షద్ ఖాన్ 4-0-32-1, ప్రసిధ్ కృష్ణ 1-0-7-0.

మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ 436.5 పాయింట్లు
ఆరెంజ్ క్యాప్ (మోస్ట్ రన్స్) 776
సూపర్ స్ట్రయికర్ 237.30
అత్యధిక సిక్సర్లు 72

కగిసో రబాడ 29

పంజాబ్‌కింగ్స్ 140 పాయింట్స్

సాయి సుదర్శన్ 75