ODI World Cup 2027 : టీమిండియా స్టార్ ద్వయంగా పేరొందిన విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) మళ్లీ బ్లూ జెర్సీతో మైదానంలోకి దిగితే చూడాలనుకుంటున్నారు అభిమానులు. టీ20, టెస్టులు.. ఈ రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీ వన్డేల్లో చెలరేగేందుకు సిద్ధమవుతున్నారు. అయినా సరే ఈ ఇద్దరికీ వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కడంపై సందేహాలు వెలిబుచ్చుతున్నారు కొందరు. కుర్రాళ్లు దూసుకొస్తున్న నేపథ్యంలో మెగా టోర్నీలో ‘రోకో’కు ఛాన్స్ కష్టమే అని మాజీలు సైతం అభిప్రాయ పడుతున్నారు.
కానీ.. అనుభవజ్ఞులైన కోహ్లీ, హిట్‌మ్యాన్ వరల్డ్ కప్‌లో ఆడితే టీమిండియాకు తిరుగుండదని అంటున్నాడు రాస్ టేలర్ (Ross Taylor). ‘కోహ్లీ, రోహిత్‌లను చూడండి.. ఇప్పటికీ చాలా ఫిట్‌గా ఉన్నారు. వయసు పైబడుతున్నా తమ బ్యాట్ పవర్ చూపిస్తూ పరుగులు సాధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రికార్డుల బద్ధలు కొట్టిన ఈ ఇద్దరు ఇంకా ఏం కోరుకుంటున్నారో వాళ్లకు మాత్రమే తెలుసు. ఇద్దరూ తండ్రులయ్యారు. క్రికెట్ కోసం కుటుంబం, పిల్లలకు చాలారోజులు దూరంగా ఉంటున్నారు. ఆటపట్ల వాళ్లకున్న చిత్తశుద్ది ప్రపంచానికి తెలుసు. భారత క్రికెట్‌కు కూడా విరాట్, రోహిత్ చాల సేవ చేశారు. అందుకే ఈ దిగ్గజ ఆటగాళ్లు 2027 వన్డే వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఉండాలని కోరుకుంటున్నా’ అని న్యూజిలాండ్ వెటరన్ వెల్లడించాడు.
🚨 ANNOUNCEMENT 🚨
Rohit Sharma & Virat Kohli’s will play in the 2027 ODI World Cup. pic.twitter.com/d1K2eSn7ob
— indianTeamCric (@Teamindiacrick) August 10, 2025
నిరుడు పొట్టి వరల్డ్ కప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలకమైన రోహిత్, కోహ్లీలు సంయుక్తంగా వన్డే వరల్డ్ కప్ మాత్రం గెలవలేదు. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలుపొందిన జట్టులో కోహ్లీ సభ్యుడు కాగా.. రోహిత్ మాత్రం మిస్ అయ్యాడు. రెండేళ్ల క్రితం అతడి సారథ్యంలో భారత్ ఫైనల్ చేరినా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్ల విజృంభణతో ఆదిలో తడబడిన రోహిత్ సేన భారీ స్కోర్ చేసినా.. ట్రావిస్ హెడ్ మెరుపు సెంచరీతో ఆసీస్ ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది. సో.. 2027లో వన్డే ప్రపంచ కప్‌తో కెరీర్ ముగించే ఆలోచనతో ఉన్నారిద్దరూ. కానీ.. మరో ఏడాది వరకూ ఫిట్‌గా ఉంటారా? సెలెక్టర్లు వీళ్లకు చాన్స్ ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది.