Rohit Shetty : భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya)ఈ ఏడాది వ్యక్తిగత జీవితంలో, ఐపీఎల్ కెప్టెన్‌గా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. అయినా సరే వాటి ప్రభావం ఆటపై పడకుండా మైదానంలో రెచ్చిపోయి ఆడుతున్నాడు. టీ20 ఫార్మాట్లో మ్యాచ్ విన్నర్ అనిపించుకున్న పాండ్యాపై బాలీవుడ్ నిర్మాత రోహిత్ శెట్టి (Rohit Shetty) ఆసక్తికర కామెంట్లు చేశాడు. గత ఏడాది పాండ్యా జీవితం సినిమా కథకు ఏమాత్రం తీసిపోదని రోహిత్ అన్నాడు.
‘మైదానంలో పాండ్యా హేళనకు గురయ్యాడు. ఆ తర్వాత అతడు అద్భుతంగా రాణించగా టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజేత అయింది. ఆ తర్వాత మరోసారి హార్దిక్ పేరు మీడియాలో వైరల్ అయింది. అంతే.. ప్రజలంతా హార్దిక్.. హార్దిక్ అంటూ అతడిని నామం జపించారు. గత ఏడాది నుంచి పాండ్యా జీవితం అచ్చం సినిమాను తలపించింది’ అని రోహిత్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
బాలీవుడ్ నిర్మాతగా, ఖత్రోంకే ఖిలాడీ రియాలిటీ షో నిర్వాహకుడిగా రోహిత్ చాలా పాపులర్. ఈమధ్యే అతడు అజయ్ దేవగణ్ హీరోగా సింగమ్ అగెన్ సినిమాను నిర్మించాడు. ఇక పాండ్యా విషయానికొస్తే.. వరల్డ్ కప్ విజేతగా స్వదేశం వచ్చిన అతడు భార్య నటాషా స్టాంకోవిక్‌కు వీడ్కోలు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న పాండ్యా సిరీస్ అనంతరం స్వదేశం రానున్నాడు.
టీ 20 వరల్డ్ కప్ హీరోగా స్వదేశం వచ్చిన పాండ్యా వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అందరూ ఊహించినట్టుగానే భార్య నటాషాతో తెగతెంపులు చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఏం రాసుకొచ్చాడంటే..?
‘నాలుగేండ్ల దాంపత్య జీవితం తర్వాత పరస్పర ఒప్పందంతో నటాషా, నేను విడాకులకు సిద్ధమయ్యాం. కలిసి బతికేందుకు ఎంతో ప్రయత్నించాం. కానీ, కుదరలేదు. దాంతో, ఇద్దరి ప్రయోజనాల మేరకు విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు పుట్టిన అగస్త్య ఇక ముందు కూడా మా ఇద్దరి ప్రేమను పొందనున్నాడు. కో పేరెంట్‌గా అతడికి అన్ని సమకూర్చడమే కాకుండా, అతడిని సంతోషంగా ఉంచుతాం. ఈ కష్ట సమయంలో మా గోప్యతకు భంగం కలిగించ వద్దని అభిమానులను కోరుతున్నా’ అని పాండ్యా వెల్లడించాడు.
సెర్బియా మోడల్ అయిన నటాషాకు, పాండ్యాకు కరోనా తొలి వేవ్ సమయం (Corona Time)లోపెళ్లి అయింది. 2020 మార్చి 31న అతికొద్ది మంది సమక్షంలో కోర్టులో హార్దిక్, నటాషాలు ఒక్కటయ్యారు. అది కరోనా టైమ్ కావడంతో సాదాసీదాగా వీళ్లిద్దరూ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. పరిస్థితులు చక్కబడ్డాక బంధు, మిత్రుల ముందు వైభవంగా మనువాడాలని హార్దిక్, నటాషాలు అప్పుడే నిర్ణయించుకున్నారు. అందుకు ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ముహూర్తం పెట్టుకున్నారు. ఉదయ్‌పూర్ వేదికగా కన్నులపండువగా వీళ్లు రెండోసారి వివాహం చేసుకున్నారు. కుమారుడు అగస్త్యను ఎత్తుకొని మురిసిపోతూ ఫొటోలు దిగారు.