రాంచీ: దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ఇండియా సిద్ధమైంది. ఆదివారం నుంచి మొదలుకానున్న మూడు వన్డేల సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే అందుబాటులో ఉన్న సిరీస్‌ల ఆధారంగా ప్లేయర్లను ఎంపిక చేసుకోవాలని చూస్తున్నది. ముఖ్యంగా వికెట్‌కీపర్, బ్యాటర్‌గా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లో ఎవరికి బెర్తు ఇవ్వాలనే దానిపై ఆలోచన చేస్తున్నది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో జట్టుకు రాహుల్ నాయకత్వం వహిస్తుండగా, పంత్ కెప్టెన్సీలో ఈమధ్యే రెండో టెస్టులో ఘోర ఓటమి చవిచూసింది.
దీనికి తోడు చెత్త షాట్లకు పోయి వికెట్లు ఇచ్చుకోవడంతో పంత్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కీపర్, బ్యాటర్‌గా రాహుల్‌ను తీసుకుంటే అప్పుడు పంత్ కేవలం మిడిలార్డర్ బ్యాటర్‌గానే తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కీపర్‌గా పంత్‌కు అవకాశమిస్తే..రాహుల్ బ్యాటర్‌గా రావాల్సి ఉంటుంది. దీంతో ఆల్‌రౌండర్ స్థానానికి ఎసరు వస్తుంది. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే నితీశ్‌కుమార్‌రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై మేనేజ్మెంట్ ఇంకా నిర్ణయానికి రాలేదని తెలుస్తున్నది.