బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు కోసం సిద్ధమవుతున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. మూడు ఫార్మాట్లలో జట్టును నడిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ బారిన పడ్డాడు. లీస్టర్తో నాలుగు రోజుల వామప్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో రోహిత్‌కు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో రోహిత్ ఐసొలేషన్‌లో ఉన్నాడు. ‘కెప్టెన్ రోహిత్‌కు కరోనా సోకింది. శనివారం జరిపిన ర్యాపిడ్ టెస్టులో ఈ ఫలితం వచ్చింది. అతడికి మరోసారి ఆర్టీ పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తాం. ప్రస్తుతం రోహిత్ వైద్యుల పర్యవేక్షణలో ఐసొలేషన్‌లో ఉన్నాడు’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. టెస్టు మ్యాచ్‌కు ఎక్కువ సమయం లేకపోగా.. హిట్‌మ్యాన్ ఆరు రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉండాల్సి ఉండటంతో ఇంగ్లండ్‌తో పోరుకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ అదే జరిగిన అతడి స్థానంలో ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లో ఒకరు జట్టుకు సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతేడాది ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లిన టీమ్ఇండియా.. నాలుగు టెస్టులు పూర్తయ్యేసరికి 2-1తో ఆధిక్యంలో ఉన్న సమయంలో కరోనా విజృంభించడంతో ఆఖరి మ్యాచ్ ఆడకుండా అర్ధాంతరంగా పర్యటన ముగించుకుంది. ఆ మ్యాచ్‌ను జూలై 1 నుంచి నిర్వహించాలని ఇరు దేశాల బోర్డులు నిర్ణయించగా.. మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. ఇంగ్లండ్ బయలు దేరకముందే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడగా.. లండన్‌లో అడుగుపెట్టాక విరాట్ కోహ్లీకి కొవిడ్ సోకినట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా రోహిత్ మహమ్మారి బారిన పడటం ఆందోళన రేకెత్తిస్తున్నది.
ఉమ్రాన్ అరంగేట్రం
మలాహిడే (ఐర్లాండ్): ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగి తన వేగంతో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కే ఉమ్రాన్ జాతీయ జట్టుకు ఎంపికైనా.. ఐదు మ్యాచ్‌ల్లోనూ అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఆదివారం పోరులో అతడికి తొలిసారి అవకాశం దక్కింది. మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించిన టీమ్ మీటింగ్‌లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అతడికి క్యాప్ అందించాడు. పొట్టి ఫార్మాట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 98వ ఆటగాడిగా ఉమ్రాన్ నిలిచాడు. మరో పేసర్ అర్శ్‌దీప్ సింగ్ అరంగేట్రం చాన్స్ కోసం వేచి చూస్తున్నాడు.
ఐర్లాండ్ 108/4
మలహిడే (ఐర్లాండ్): పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైన భారత జట్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఆదివారం భారీ వర్షం కారణంగా తొలి పోరు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. మొదటిసారి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోగా.. ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ (33 బంతుల్లో 64; 6 ఫోర్లు, 3 సిక్సర్లు సిక్సర్లు) టాప్ స్కోరర్.
భారత బౌలర్లలో భువనేశ్వర్, హార్దిక్, అవేశ్, చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. భువనేశ్వర్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి ఆండీ బాల్బిర్నే (0)ను ఔట్ చేయగా.. హార్దిక్ పాండ్యా మరుసటి ఓవర్లో పాల్ స్టిర్లింగ్ (4)ను బుట్టలో వేసుకున్నాడు. గారెత్ డెల్ని (8)ని అవేశ్ ఖాన్ వెనక్కి పంపడంతో పవర్ ప్లే (4 ఓవర్లు) ముగిసే సరికి ఐర్లాండ్ 22 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అంతర్జాతీయ స్థాయిలో వేసిన తొలి ఓవర్లో ఉమ్రాన్ తన వేగంతో ఆకట్టుకున్నా.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. టెక్టర్ భారీ షాట్లతో ఐర్లాండ్‌కు మంచి స్కోరు అందించాడు.