Rohit Sharma : వెస్టిండీస్ గడ్డ మీద టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న క్షణం భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయం. పదిహేడేండ్ల పొట్టి ట్రోఫీ నిరీక్షణకు తెరపడిన రోజును అభిమానులు మర్చిపోలేరు. బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఓటమి అంచున నిలిచిన టీమిండియా అనూహ్యంగా విజయం సాధించింది. అయితే.. వరల్డ్ కప్ ట్రోఫీ సాధించడంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) పాత్ర ఎంతో ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తాజాగా వెల్లడించాడు. ఇంతకు అతడు ఏం చెప్పాడంటే..?
వరల్డ్ కప్ ఆసాంతం దుమ్మురేపిన భారత జట్టు ఫైనల్లో తడబడింది. బార్బడోస్‌లో టీమిండియా నిర్దేశించిన 177 పరుగుల ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klassen) విధ్వంసక బ్యాటింగ్‌తో భయపెట్టాడు. అక్షర్ పటేల్ వేసిన ఓవర్లో సిక్సర్ల మోతతో జట్టును గెలుపు వాకిట నిలిపాడు. ఆ దశలో పంత్ తన బుర్రకు పదును పెట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు అని రోహిత్ చెప్పాడు. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్న భారత కెప్టెన్ జూన్ 30 బార్బడోస్‌లో పంత్ ఏం చేశాడో వివరించాడిలా..
Captain Rohit Sharma revealed the untold story of Rishabh Pant when India needed to defend 30 runs in 30 balls. Two Brothers ! 🥺❤️
pic.twitter.com/EmqIrrCFb3— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@IamHydro45_) October 5, 2024
‘ఫైనల్లో ఒక దశలో దక్షిణాఫ్రికా విజయానికి 4 ఓవర్లలో 26 పరుగులు కావాలి. సరిగ్గా అప్పుడే పంత్ తెలివిగా ఆలోచించి ఫిజయోను పిలిపించాడు. అతడితో మోకాలి ప్యాడ్స్ వేయించుకున్నాడు. ఆతర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ నెమ్మదించింది. పంత్ తీసుకున్న ఆ బ్రేక్ కారణంగా అప్పటికే జోరుమీదున్న క్లాసెన్, మిల్లర్ల ఫోకస్ తగ్గింది. ఆ క్షణం మ్యాచ్‌ను మలుపు తిప్పంది. మా విజయంలో పంత్ వ్యూహం భాగమే’ అని రోహిత్ తెలిపాడు.
పంత్ బ్రేక్ తీసుకున్న కాసేపటికే హార్దిక్ పాండ్యా ఓవర్లో క్లాసెన్ ఔటయ్యాడు. అనంతరం జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీసి సఫారీలను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇక.. ఫైనల్ ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద సూర్యకుమార్ యాదవ్ కండ్లు చేదిరే రీతిలో క్యాచ్ అందుకున్నాడు. అంతే.. టీమిండియా రెండో సారి టీ20 వరల్డ్ విజేతగా నిలిచింది.