Business man missing : కర్ణాటకలోని మంగళూరు నియోజకవర్గంలో ఓ వ్యాపారవేత్త కనిపించకుండా పోయారు. మంగళూరు మాజీ ఎమ్మెల్యే మెయిదీన్ బవ సోదరుడు అయిన వ్యాపారవేత్త బీఎం ముంతాజ్ అలీ అదృశ్యమయ్యారు. ఆయన కారు కులూరు వంతెన సమీపంలో ముందు భాగం ధ్వంసమైన స్థితిలో కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఆదివారం తెల్లవారుజామున కులూరు వంతెన సమీపంలో వ్యాపారవేత్త ముంతాజ్ అలీకి చెందిన కారు ఉన్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. వెంటనే తాము ఘటనా స్థలానికి చేరుకున్నామని, ప్రమాదానికి గురైన బీఎండబ్ల్యూ కారు అక్కడ ఉండటం గమనించామని చెప్పారు. ముంతాజ్ అలీ కారును అక్కడే వదిలేసి పక్కనే ఉన్న నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సందేహిస్తున్నామని తెలిపారు.
ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని ఆయన వెల్లడించారు. తెల్లవారుజాము మూడు గంటలకు ముంతాజ్ అలీ తన కారులో ఇంటి నుంచి బయలుదేరినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఐదు గంటలకు కులూరు వంతెన వద్ద ప్రమాదం చోటుచేసుకున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.