IND vs AUS | అడిలైడ్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టుకు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నాయి. ఈనెల 6 నుంచి అడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య డే అండ్ నైట్ టెస్టు జరుగుంది. ఇప్పటికే మ్యాచ్ ప్రాక్టీస్ కోసం పీఎం లెవన్‌తో కాన్బెర్రాలో మ్యాచ్ ఆడిన టీమ్ఇండియా..అడిలైడ్‌లో అడుగుపెట్టగానే ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టింది. మ్యాచ్‌కు మరో రెండే రోజులు మిగిలుండటంతో రెండు జట్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. చాలా రోజుల తర్వాత గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టు ఆడబోతున్న టీమ్ఇండియాకు అడిలైడ్‌లో గత అనుభవాలు వెంటాడుతున్నాయి. గత బీజీటీ టోర్నీలో ఇదే అడిలైడ్ పిచ్‌పై టీమ్ఇండియా టెస్టుల్లో చెత్త రికార్డు(36 ఆలౌట్)ను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. తిరిగి అలాంటి ప్రదర్శన చేయద్దనుకుంటున్న భారత్ అందుకు తగ్గట్లు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నది.
రాత్రి సమయంలో గులాబీ బంతితో వచ్చే స్వింగ్‌ను ఎదుర్కొనేందుకు గంటల కొద్ది ప్రాక్టీస్ చేస్తున్నారు. మంగళవారం భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు సెషన్ల వారీగా సాధన చేశారు. టీమ్ఇండియా నుంచి మొత్తం నాలుగు నెట్స్‌లో ఓపెనింగ్ ద్వయం యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, రోహిత్‌శర్మ, రిషబ్‌పంత్, సుందర్, నితీశ్‌కుమార్‌రెడ్డి త్రోడౌన్స్తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. వీరి ప్రాక్టీస్ చూస్తే..బ్యాటింగ్ ఆర్డర్‌ను తలపిస్తూ ఒకరి తర్వాత నెట్స్‌లో ఆడారు. పెర్త్‌లో సూపర్ సెంచరీతో కదంతొక్కిన యశస్వి జైస్వాల్‌కు తోడు అనుభవాన్ని చాటుకున్న రాహుల్‌ను అడిలైడ్ టెస్టులోనూ ఓపెనింగ్‌కు పంపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని బలపరుసూ కెప్టెన్ రోహిత్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు సిద్ధమైన్నట్లు తెలిసింది. జైస్వాల్, రాహుల్ ఫామ్‌ను కొనసాగించేందుకు టీమ్ మేనేజ్మెంట్ మొగ్గుచూపినట్లు వార్తలు వస్తున్నాయి.
రోహిత్ ముమ్మరంగా: వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్..అడిలైడ్ టెస్టులో భారత్‌ను నడిపించనున్నాడు. పెర్త్ టెస్టులో బుమ్రా కెప్టెన్సీలో టీమ్ఇండియా దుమ్మురేపగా, అడిలైడ్‌లోనూ అదే దూకుడు కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతున్నది. ఇందుకోసం ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అన్న సూత్రానికి కట్టుబడుతూ ప్లేయర్లు ముందుకుసాగుతున్నారు. ముఖ్యంగా రోహిత్..మంగళవారం రెండు సెషన్ల పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. త్రోడౌన్ స్పెషలిస్టులు నువాన్ సేనావిరత్నే(లెఫ్టార్మ్), రాఘవేంద్ర, దయానంద్ విసిరిన బంతులను రోహిత్ సమర్థంగా ఎదుర్కొన్నాడు. పిచ్‌పై వేగంగా దూసుకొస్తున్న బంతులను అదే ఒరవడితో హిట్‌మ్యాన్ షాట్లు ఆడాడు. తన ట్రేడ్‌మార్క్ పుల్‌షాట్లు ఆడుతూ ఆత్మవిశ్వాసం కనబరిచాడు. మరోవైపు బెంగాల్ ద్వయం ఆకాశ్‌దీప్, ముకేశ్‌కుమార్..నెట్స్‌లో తమదైన స్వింగ్‌తో విరాట్‌ను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. మరో ఎండ్‌లో యువ పేసర్ హర్షిత్ రానా..తన గురువు గంభీర్, బౌలింగ్ కోచ్ మార్నీ మోర్కెల్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు సిరీస్‌లో వెనుకంజలో ఉన్న ఆస్ట్రేలియా..పుంజుకునే ప్రయత్నంలో ప్రాక్టీస్ చెమటోడ్చారు. మొత్తంగా రెండు జట్లు సిరీయస్‌గా ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి.