దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఒకవేళ ఇండియా ఓడిపోతే.. రోహిత్ శర్మ(Rohit Sharma) భవిష్యత్తు ఏంటన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఫైనల్లో ఇండియా ఓడిపోతే, కెప్టెన్ రోహిత్ శర్మ .. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కథనాన్ని ఓ మీడియా రాసింది. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌లో ఓటమితో రోహిత్ తీవ్ర వత్తిడికి లోనైన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగే సీటీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఇండియా ఢీకొట్టనున్నది. ఫైనల్లో ఒకవేళ ఇండియా గెలిస్తే, అప్పుడు రోహిత్ శర్మ తన కెరీర్‌ను మరింత కాలం పొడిగించే అవకాశాలు ఉన్నాయని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
2024లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు.. ఆ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశారు. కేవలం రెండు ఫార్మాట్లు ఆడేందుకు మాత్రమే ఆసక్తి చూపారు. అయితే చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్లీ జూన్‌లో ఇంగ్లండ్‌లో ఇండియా పర్యటిస్తుంది. ఆ తర్వాత భారత్ పాల్గొనే అతిపెద్ద వన్డే టోర్నమెంట్ దగ్గర్లో ఏదీ లేదు. మళ్లీ 2027లో వన్డే వరల్డ్‌కప్ జరగనున్నది. అయితే చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వరల్డ్‌కప్‌కు మరీ ఎక్కువ సమయం ఉన్న కారణంగా.. జట్టులో ఆటగాళ్ల మార్పులు భారీగా చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఒకవేళ ఇండియా గెలిచినా, లేక ఓడినా.. తన భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం పూర్తిగా రోహిత్ చేతుల్లో ఉంటుందని రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ఒకవేళ ఇండియా గెలిస్తే, జట్టులో సభ్యుడిగా రోహిత్ కంటిన్యూ అవుతాడని పేర్కొన్నారు. కెప్టెన్సీ బాధ్యతలను మరొక్కరికి అప్పగించే అవకాశం ఉన్నది. హార్దిక్ పాండ్యా లేదా శుభమన్ గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వనున్నారు.