Team India | నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: సంప్రదాయక టెస్టు క్రికెట్ ఆడే తీరును పూర్తిగా మార్చేసిన ఇంగ్లండ్.. వారి దూకుడుకు పెట్టుకున్న పేరు ‘బజ్‌బాల్’. కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆధ్వర్యంలో ఆ జట్టు సంచలన ఆటతీరుతో టెస్టు క్రికెట్‌ను సరికొత్త పుంతలు తొక్కిస్తున్నది. ఇక ఇప్పుడు దానికి అడ్వాన్స్డ్ వర్షెనా? అన్నట్టుగా కాన్పూర్‌లో భారత్ ‘గమ్‌బాల్’ ఆట ఆడింది. డ్రా దిశగా సాగుతున్న రెండో టెస్టులో ఫలితం తేలే అవకాశం కనిపిస్తుందంటే దానికి కారణమూ ఈ ఆటే.
నయా కోచ్ గౌతం గంభీర్ పేరు మీదుగా వచ్చిన ఈ గమ్‌బాల్.. కాన్పూర్ టెస్టులో రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్ సమయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. 3 ఓవర్లలో 50 పరుగులు, 10.1 ఓవర్లలో 100, 24.2 ఓవర్లలో 200, 30.1 ఓవర్లలో 250.. వన్డేలలో కూడా అరుదుగా కనబడే ఈ అంకెలను రోహిత్ సేన.. కాన్పూర్‌లో అలవోకగా ఆడేసింది. 34.4 ఓవర్లలో ఏకం గా 8.22 రన్‌రేట్‌తో దూకుడు ప్రదర్శించింది.
ఇక హిట్‌మ్యాన్ భారత ఇన్నింగ్స్‌ను డిక్లే ర్ చేయడమూ ఒక ఆశ్చర్యకర నిర్ణయమే. 12 ఓవర్ల ఆట మిగిలున్న నాలుగో రోజు ఆటలో వీలైనన్ని వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి మానసిక ైస్థెర్యాన్ని దెబ్బతీయడానికి వేసిన ఎత్తుగడ కూడా ఫలించింది. 11 ఓవర్లు ఆడిన బంగ్లా ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయింది. ఇదే స్ట్రాటజీని రాబోయే రోజుల్లో పాటిస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేము గానీ కాన్పూర్ వరకైతే అభిమానులకు పసందైన క్రికెట్ విందును పంచుతున్నది.