Rohit Sharma | భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. హిట్‌మ్యాన్ నాయకత్వంలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తున్నది. ఎనిమిది నెలల్లోనే టీమిండియా రెండో ఐసీసీ టైటిల్‌ను నెగ్గింది. రోహిత్ నాయకత్వంలో భారత జట్టు గతేడాది టీ20 ప్రపంచకప్‌ను గెలిచింది. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. టోర్నీలో ఐదు వరుస విజయాలతో ట్రోఫీని గెలుచుకుంది. ఈ ట్రోఫీని గెలువడంతో రోహిత్.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పెషల్ క్లబ్లో చేరాడు. భారత్‌కు ఒకటి కంటే ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు అందించిన రెండో కెప్టెన్‌గా ఘనత సాధించాడు. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా మూడు ఐసీసీ టైటిల్స్‌ను గెలిచింది. సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్ నాయకత్వంలో భారత జట్టు ఒక్కో ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని అందుకున్న మూడో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కావడం విశేషం.
రోహిత్ శర్మ ఇటీవల వన్డేల్లో రాణిస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు భారత్‌కు శుభారంభం అందించినా.. భారీ ఇన్నింగ్స్‌ను ఆడలేకపోయాడు. కానీ, సరైన సమయంలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ 41 బంతుల్లో వన్డేల్లో 58వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రోహిత్-శుభ్‌మన్ గిల్ జోడీ తొలి వికెట్‌కు 105 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దాంతో విజయంలో ఈ భాగస్వామ్యం కీలకపాత్ర పోషించింది. రోహిత్ 83 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 76 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. భారత్‌కు టైటిల్‌ను అందించడంలో దూకుడుగా ఉడి.. రోహిత్ కీలక పాత్ర పోషించాడు. ఫోర్లు, సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్ స్థాయిలోనే రోహిత్ కెప్టెన్సీ రికార్డు బాగున్నది. రోహిత్ 142 మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు. ఇందులో జట్టు 105 మ్యాచ్‌లను గెలిచింది. 33 మ్యాచుల్లో ఓటమిపాలైంది. రోహిత్ విన్నింగ్ పర్సంటేజ్ 73.94శాతంగా ఉన్నది. ఏ కెప్టెన్‌తో పోల్చినా ఇదే అత్యుత్తమం. రోహిత్ తర్వాత రికీ పాంటింగ్ 324 బంతుల్లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో 220 మ్యాచ్‌లను గెలువగా.. 77 మ్యాచ్‌లు ఓడిపోయింది. అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్‌గా పాంటింగ్ విన్నింగ్ పర్సంటేజ్ 67.90గా ఉన్నది. ఆ తర్వాత స్టీవా నాయకత్వంలో ఆస్ట్రేలియా 163 మ్యాచుల్లో 108 విజయాలు నమోదు చేయగా.. 44 మ్యాచుల్లో ఓడిపోయింది. విజయశాతం 66.25శాతంగా ఉంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో 213 మ్యాచులు భారత్ 137 మ్యాచుల్లో గెలిచింది. 60 మ్యాచుల్లో ఓడగా.. విజయశాతం 64గా నమోదైంది.