కానెబెర్రా: ఆస్ట్రేలియా టూర్లో ఉన్న టీమ్ఇండియా అడిలైడ్‌లో డే అండ్ నైట్ టెస్టుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ప్రైమ్ మినిస్టర్ లెవెన్‌తో కాన్బెర్రాలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు మధ్య సరదా ఘటన చోటుచేసుకున్నది. మొదట బ్యాటింగ్ చేసిన పీఎం ఎలెవన్ 43.2 ఓవర్లలో 240 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టు బ్యాటింగ్ సందర్భంగా డగౌట్లో కూర్చుకున్న రోహిత్, శుభ్‌మన్ గిల్, హిర్షిత్ రాణా, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా గిల్, రాణా నవ్వుకుంటూ రోహిత్‌ను ఏదో అన్నారు. దీంతో తన హిట్‌మ్యాన్ తన కుడి మోచేతితో పక్కనే ఉన్న గిల్ ఛాతీపై గుద్దాడు. అనంతరం అంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఇదంతా కెమెరాల్లో రికార్డయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నది.
కాగా, అడిలైడ్‌లో డే అండ్ నైట్ టెస్టుకు సిద్ధమవుతున్న భారత జట్టుకు ఆ మ్యాచ్ ఆరంభానికి ముందు మరో విజయం దక్కింది. ప్రైమ్ మినిస్టర్ లెవెన్‌తో కాన్బెర్రాలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు రోజుల ఆటలో భాగంగా తొలి రోజు వర్షార్ఫణమవగా రెండో రోజూ వరుణుడి అంతరాయంతో మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన పీఎం ఎలెవెన్.. 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు ఓపెనర్ సామ్ కొన్సస్ (97 బంతుల్లో 107, 14 ఫోర్లు, 1 సిక్స్), హన్నో జాకబ్స్ (61) రాణించారు.
భారత బౌలర్లలో హర్షిత్ రాణా (4/44), ఆకాశ్ దీప్ (2/58) మెరిశారు. అనంతరం భారత్.. 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. నిర్ణీత ఓవర్ల కంటే ముందే టీమ్ఇండియా మ్యాచ్ గెలిచినా ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో పూర్తి ఓవర్ల పాటు ఆడించారు. పెర్త్ టెస్టుకు ముందు వేలిగాయంతో దూరమైన శుభ్‌మన్ గిల్ (62 బంతుల్లో 50 రిటైర్డ్ హర్ట్, 7 ఫోర్లు) ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అడిలైడ్ టెస్టుకు తాను సిద్ధమేనని చెప్పకనే చెప్పాడు. యశస్వీ జైస్వాల్ (45), నితీశ్ రెడ్డి (42), వాషింగ్టన్ సుందర్ (42 నాటౌట్) భారత విజయంలో కీలకపాత్ర పోషించారు.