Rohit Sharma | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొద్దికాలంగా పేలవమైన ఫామ్‌తో ఇబ్బందిపడుతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలోనూ తన చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ సిరీస్ తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. రోహిత్ వరుస వైఫల్యాల నేపథ్యంలో పలువురు మాజీలతో పాటు అభిమానులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. రోహిత్ టెస్టుల్లో కొనసాగడం అవసరమా? అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐతో పాటు సెలెక్టర్లు సైతం ఈ విషయంలో గురించి మాట్లాడినట్లుగా తెలుస్తున్నది. రోహిత్ తన మనసును మార్చుకునే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని తెలుస్తున్నది. రోహిత్ ఎప్పుడు తిన నిర్ణయాన్ని ప్రకటిస్తాడన్న విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. కానీ, జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా మొదలయ్యే ఐదో టెస్ట్ అనంతరం రిటైర్మెంట్పై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం.
టీమిండియా ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు అర్హత సాధించగలిగితే.. రోహిత్ అప్పటి వరకు కొనసాగేలా సెలెక్టర్లు ఒత్తిడి తీసుకువచ్చేందుకు అవకాశాలున్నాయి. నాలుగో టెస్ట్ ఓటమి తర్వాత టీమిండియా ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు కాస్త దూరమైంది. ప్రస్తుతం, ఫైనల్ ఆశలు కాస్త ఉన్నా.. అది ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. మెల్బోర్న్ టెస్ట్‌లో పరాజయం అనంతరం రోహిత్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. గతంలో ఏం జరిగిందో ఆలోచించాల్సిన అవసరం లేదని.. సహజంగానే కొన్ని ఫలితాలు తమకు అనుకూలంగా లేదన్నాడు. బాక్సిండ్ డే టెస్ట్‌లో ఓటమి తనకు మానసిక వేదనను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అనుకున్నది చేయలేని సమయంలో.. మానసిక సంఘర్షణ ఉంటుందని రోహిత్ పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్టు నిరాశపరిచిందన్న రోహిత్.. మ్యాచ్‌లు గెలిచేందుకు మార్గాలు ఉంటాయని.. వాటిని అన్వేషించలేకపోయామని చెప్పుకొచ్చాడు. చివర వరకు పోరాడాలని నిర్ణయించినా.. దురదృష్టవశాత్తు అలా చేయలేకపోయామని చెప్పాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల్లో రోహిత్ 31 పరుగులు చేశాడు. బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన మ్యాచుకు రోహిత్ దూరమయ్యాడు. రోహిత్ గైర్హాజరీలో మిస్టరీ బౌలర్ కెప్టెన్‌గా కొనసాగాడు. తొలి టెస్ట్‌లో 295 పరుగుల తేడాతో తొలి టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించింది. అడిలైడ్‌లో జరిగిన టెస్టుతో మళ్లీ టీమిండియాతో రోహిత్ చేశాడు. డే-నైట్ టెస్ట్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఆ తర్వాత గబ్బా, మెల్బోర్న్లో టెస్టుల్లోనూ పరాజయం తప్పలేదు. రోహిత్ ఐదు ఇన్నింగ్స్‌లో 6.20 సగటుతో 31 పరుగులు చేశాడు. వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 3, 6, 10, 3, 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఏ విదేశీ కెప్టెన్‌కైనా అత్యల్ప సగటు ఇదే. ఓ వైపు జట్టు ఓటమి.. మరో వైపు రోహిత్ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో రోహిత్ రిటైర్మెంట్కు సిద్ధమయ్యాడని తెలుస్తున్నది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించకపోతే సిడ్నీ టెస్ట్ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నట్లుగా పలు నివేదికలు పేర్కొన్నాయి.