మెల్బోర్న్: మెల్బోర్న్లో జరిగిన టెస్టులో ఇండియా దారుణంగా ఓడింది. 184 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా ఆ టెస్టులో విజయం సాధించింది. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో కెప్టెన్ రోహిత్ శర్మ మట్లాడాడు. బాక్సింగ్ డే టెస్టులో ఓటమి మానసిక ఆందోళన కలిగించిందన్నాడు. అనుకున్నది చేయలేనప్పుడు మానసిక సంఘర్షణ ఉంటుందని రోహిత్ తెలిపాడు. ఈ సిరీస్‌లో రోహిత్ కూడా సరిగా ఆడలేకపోవడంతో అతనిపై కూడా విమర్శలు అధికమయ్యాయి.
ఆరు ఇన్నింగ్స్‌లో అతను కేవలం 31 రన్స్ మాత్రమే చేశాడు. ఓటమి డిస్టర్బింగ్‌గా ఉందని, వ్యక్తిగత లోపాలపై దృష్టి పెట్టాలన్నాడు. బాక్సింగ్ డే టెస్టు నిరాశపరిచిందని, మ్యాచ్‌లు గెలిచేందుకు మార్గాలు ఉంటాయని, కానీ ఆ మార్గాలను అన్వేషించలేకపోయామని రోహిత్ పేర్కొన్నాడు. చివర వరకు పోరాడాలని నిశ్చయించామని, కానీ దురదృష్టవశాత్తు అలా చేయలేకపోయినట్లు చెప్పాడు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఓ దశలో 90 రన్స్‌కే ఆరు వికెట్లను కోల్పోయింది. కానీ ఆ తర్వాత చివరి వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఆస్ట్రేలియా.. భారీ ఆధిక్యాన్ని కూడా నమోదు చేసింది. ఆ పరిస్థితులను సరిగా వినియోగించుకోలేకపోయినట్లు రోహిత్ తెలిపాడు. విపత్కర పరిస్థితుల్లో చాలా పటిష్టమైన ఆటను ఆడాలన్న ఉద్దేశంతో ఉన్నామని, కానీ అనుకున్న రీతిలో రాణించలేకపోయామన్నాడు. రూమ్‌కు వెళ్లిన తర్వాత ఎలా ఓ జట్టుగా పోరాడాలన్న ఆలోచన చేసినట్లు రోహిత్ చెప్పాడు. మా దగ్గర ఉన్నవన్నీ మేం ప్రయోగించాం, వాళ్లు కూడా తీవ్రంగా పోరాడారు, ఆ చివరి వికెట్ భాగస్వామ్యం మొత్తం మ్యాచ్‌ను మార్చేసిందన్నాడు.
టార్గెట్ కష్టమైందే అయినా.. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఉద్దేశంతో ఆడినట్లు రోహిత్ తెలిపాడు. 340 అంత ఈజీగా కాదన్న విషయం తమకు తెలుసు అని, ముందుగా ఓ ఫ్లాట్‌ఫామ్‌ను సెట్ చేసి, చివరి రెండు సెషన్ల కోసం వికెట్లను కాపాడాలనుకున్నాం, కానీ వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, టార్గెట్ చేరుకునే స్థాయిలో ఆడలేకపోయినట్లు చెప్పాడు.
తెలుగు బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపించాడు రోహిత్. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అతన్ని మెచ్చుకున్నాడు. బహుశా అతను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియాకు అతను రావడం ఫస్ట్ టైం అని, ఇలాంటి పరిస్థితులు చాలా టఫ్‌గా ఉంటాయని, కానీ అతను చాలా పరిణితి చూపించాడని, నితీశ్ టెక్నిక్ కూడా బాగుందన్నాడు. అతనికి జట్టు ఎప్పుడూ అండగా ఉంటుందని రోహిత్ తెలిపాడు.
బౌలింగ్ యూనిట్‌ను ఒంటి చేతిలో నడిపిస్తున్న బుమ్రాను విశేషంగా మెచ్చుకున్నాడు రోహిత్. అతన్ని ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నామని, బుమ్రా తన కర్తవ్యాన్ని ఈజీగా నిర్వర్తిస్తాడని, అతనేమీ గణాంకాల వ్యక్తి కాదు అని పేర్కొన్నాడు. దేశం కోసం ఆడుతాడని, జట్టు కోసం మంచే చేస్తాడన్నాడు. కానీ జట్టులోని ఇతర బౌలర్ల నుంచి అతనికి సరైన సపోర్టు దక్కలేదన్నాడు.
బుమ్రా ఈ సిరీస్‌లో ఇప్పటికే 30 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు.
That’s the final wicket and another five-wicket haul for the champion bowler 🔥🔥
Jasprit Bumrah now has 30 wickets in this series so far!#AUSvIND pic.twitter.com/Rs4QlYcT6U
— BCCI (@BCCI) December 29, 2024