ముంబై : టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గ్యారేజీలోకి కొత్త కారు వచ్చేసింది. ఎరుపు రంగు లాంబోర్గిని ఉరుస్ కారును అతను కొన్నాడు. కొన్ని రోజుల క్రితమే ఆ లగ్జరీ కారు ముంబై ఇంటికి డెలివరీ అయ్యింది. అయితే గతంలో కూడా రోహిత్ శర్మకు లాంబోర్గిని ఉరుస్ కారే ఉండేది. కానీ దాన్ని డ్రీమ్11 కాంటెస్ట్ విజేతకు అందజేయడంతో.. రోహిత్ మళ్లీ కొత్త కారును ఖరీదు చేశాడు. ఇక ఆ కారు నెంబర్ 3015. రోహిత్ అభిమానులకు ఈ నెంబర్ను డీకోడ్ చేయడం సులువే. హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఇద్దరు పిల్లల పుట్టినతేదీలు ఆ నెంబర్లో ఉన్నాయి. ఇక ఆ రెండు సంఖ్యలు కలిస్తే వచ్చే 45 నెంబర్.. గతంలో రోహిత్ జెర్సీ నంబర్.
నెంబర్ ప్లేట్లోని 30 నెంబర్ను రోహిత్ కుమార్తె సమైరా బర్త్డేట్ నుంచి తీసుకున్నారు. ఆమె డిసెంబర్ 30వ తేదీన జన్మించింది. ఇక నెంబర్ 15.. కుమారుడు అహన్ పుట్టిన తేదీ నుంచి తీసుకున్నారు. అతను నవంబర్ 15వ తేదీన జన్మించాడు. రోహిత్ పాత కారుకు 264 నెంబర్ ఉండేది. ఆ నెంబర్ .. వన్డేల్లో రోహిత్ చేసిన హయ్యెస్ట్ స్కోరుకు సూచిక.
కొత్త ఉరుస్ ఎస్ఈ కారు ధర మార్కటె ప్రకారం.. 4.57 కోట్లు ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఉరుస్ ఎస్ఈ కారు 800హెచ్పీ, 950ఎన్ఎం టార్క్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇక కేవలొం 3.4 సెకన్లలోనే ఆ కారు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. చివరిసారి ఈ యేటి ఐపీఎల్లో కనిపించిన రోహిత్ శర్మ.. మళ్లీ అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో ఆడనున్నాడు.