Rohit Sharma | ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. మ్యాచ్ రెండోరోజు రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపడేశాడు. ఇది రిటైర్మెంట్ కాదని.. వీలైనంత త్వరగా పూర్తి బలంతో తిరిగి వస్తానని రోహిత్ పేర్కొన్నాడు. తాను కేవలం ఈ టెస్టులో మాత్రం ఆడడం లేదని క్లారిటీ ఇచ్చాడు. సిడ్నీ టెస్టులో గెలిచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవడం భారత్‌కు ముఖ్యమని.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని రోహిత్ తెలిపాడు. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయంలో స్టార్ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడాడు.
రిటైర్మెంట్పై బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్కు తెలిపాడని.. సిడ్నీ టెస్టు తర్వాత ప్రకటన చేస్తాడని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలన్నింటిని రోహిత్ కొట్టిపడేశాడు. తన బ్యాటింగ్ ఫామ్ బాగోలేనందుకే జట్టు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. వ్యక్తిగతంగా ఆడాలన్న ఆసక్తి కంటే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో విజయం సాధించడం జట్టుకు కీలకమైని తెలిపాడు. తన ఫామ్ బాగా లేదని తన మనసులోనూ ఉందని తెలిపాడు. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేరన్నారు. ఈ నిర్ణయం తనకు కష్టంగానే ఉందని.. కానీ, ఈ సమయంలో జట్టు అవసరం కోసం ఏమి ఆలోచిస్తున్నానో అదే ముఖ్యమని చెప్పాడు.
మెల్బోర్న్ టెస్టు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారా? లేదంటే సిడ్నీ టెస్టుకు ఒకరోజు ముందు తీసుకున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. సిడ్నీకి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించాడు. మెల్బోర్న్ టెస్టు ముగిసిన తర్వాత సిడ్నీ టెస్టుకు రెండుమూడురోజుల సమయం ఉందని.. న్యూ ఇయర్ సందర్భంగా సెలెక్టర్లు, కోచ్‌తో చర్చించలేకపోయానని తెలిపాడు. పెర్త్, అడిలైడ్, గబ్బాలో జరిగిన తొలి మూడు టెస్టుల్లో కేఎల్ రాహుల్, యశస్విలతో భారత జట్టు ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. మెల్బోర్న్లో యశస్వితో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. కాంబినేషన్‌పై స్పందిస్తూ.. పెర్త్‌కు చేరుకున్న సమయంలో ఎక్కడ ఎందుకు గెలిచామో తన మనసులో ఉందని.. దీనికి రెండు కారణాలున్నాయని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌట్ అయినప్పటికీ.. తాము ఆస్ట్రేలియాను 100 పరుగులకే ఆలౌట్ చేయగలిగామని.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో 200 పరుగుల భాగస్వామ్యం గేమ్ ఛేంజర్‌గా నిలిచిందని చెప్పాడు.
పిచ్ బౌలర్లకు సహకారం అందుతుందని.. బ్యాట్స్‌మెన్‌కు సవాల్ ఉంటుందని తెలిసునని.. అయితే, రాహుల్, జైస్వాల్ ఛాలెంజ్‌గా ఆడి జట్టును పటిష్ట స్థితికి చేర్చారని.. ఈ విషయాలన్నీ తన మనసులో ఉన్నాయని తెలిపాడు. రాబోయే ఐదారు నెలల్లో ఏం జరుగబోతోతుందని తెలియదని.. ప్రస్తుతం జట్టుకు అవసరమైన వాటిపైనే దృష్టి పెట్టాలని చెప్పాడు. దృష్టంతా ఈ ఐదుమ్యాచులపైనే ఉందని.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవాల్సి ఉందని.. కాబట్టి టీమ్‌ని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించాడు. ఈ నిర్ణయం రిటైర్మెంట్ గురించి కాదని.. తాను ఫార్మాట్ నుంచి వెనక్కి తగ్గడం లేదని స్పష్టం చేశాడు. బ్యాటింగ్ సరిగా లేనందున సిడ్నీ టెస్టు నుంచి వైదొలిగానని.. ఐదునెలల్లో బ్యాట్ పని చేయదన్న గ్యారంటీ లేదన్నాడు.
క్రికెట్లో ప్రతి సెకను, ప్రతిక్షణం జీవితం మారడం మనందరం చూశామని.. పరిస్థితులు మారుతాయనే నాపై నాకు నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు. ఎవరో చెప్పే మాటల వల్ల (రిటైర్మెంట్ వార్తలు) మన జీవితాలు మారవని.. మనం ఎప్పుడు ఆడకూడదు.. ఎప్పుడు రిటైర్మెంట్ అవ్వాలి.. ఎప్పుడు సిట్ అవుట్ చేయాలి.. ఎప్పుడు కెప్టెన్‌గా ఉండాలనే ఈ వ్యక్తులు నిర్ణయించలేరని తెలిపాడు. తాను సెన్సిబుల్ పర్సన్ అని.. మెచ్యూర్డ్ అని.. ఇద్దరు పిల్లలకు తండ్రినని.. కాబట్టి జీవితంలో ఏం కావాలో కాస్త మనసు పెట్టానన్నాడు. ఏది రాసినా అది మన నియంత్రణలో ఉండదని.. మనం నియంత్రించలేని వాటిపై దృష్టి పెట్టడం వల్ల ఏం జరుగదని తెలిపాడు.
భావోద్వేగాలను ఎలా నియంత్రించుకుంటారన్న ప్రశ్నకు.. ఇది చాలాకష్టమైందని.. తాను ఇక్కడికి బెంచ్‌పై కూర్చునేందుకు రాలేదన్నాడు. నేను మ్యాచ్ ఆడి నా జట్టును గెలిపించాలన్నాడు. 2007లో తొలిసారిగా డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చినప్పటి నుంచి నా మనస్తత్వం ఇదేనని.. కొన్నిసార్లు జట్టుకు ఏమి అవసరమో అర్థం చేసుకోవాలన్నాడు. జట్టును ముందుకు నడిపించకపోతే ప్రయోజనం ఉండదని.. వ్యక్తిగతం ఆడుకుంటూ పోతే.. జట్టు గురించి ఆలోచించకపోతే అలాంటి ఆటగాళ్లు.. కెప్టెన్లు అవసరం లేదన్నాడు. దృష్టంతా జట్టుపైనే ఉండాలన్నారు. జట్టు అని ఎందుకు అంటాం..? అందులో 11 మంది ఆడుతున్నారు కాబట్టే. ఒక్కరూ ఆడడం లేదు.. జట్టుకు అవసరమైనది చేయడానికి ప్రయత్నించాలి అని చెప్పాడు. తాను ఎవరికి గురించి మాట్లాడడం లేదని.. ఇవన్నీ తన వ్యక్తిగత అభిప్రాయాలని చెప్పాడు. ఎవరికైనా తన వ్యాఖ్యలు నచ్చకపోతే క్షమించాలన్నాడు. తాను తప్పు చేయనని.. భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు.
ఈ సందర్భంగా రోహిత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. అతని ఆటపై మంచి ఆలోచన ఉందని.. బౌలింగ్‌లో మిగతా వారికి ఆదర్శనంగా నిలిచాడన్నాడు. ఆటను అర్థం చేసుకొని.. ఎప్పుడూ జట్టును ముందుంచుతాడని తెలిపాడు. 11 సంవత్సరాలుగా అతన్ని చూస్తున్నానని.. 2013లో తొలిసారి చూశానని.. అప్పటికీ ఇప్పటికీ గ్రాఫ్ ఎంతో పెరిగిందన్నాడు. బుమ్రా కాకుండా ఏ ఆటగాడైనా జట్టు కెప్టెన్‌గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నాడా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం దాని గురించి చెప్పడం చాలా కష్టమని.. టీమ్‌లో చాలామంది ఉన్నారని.. వారంతా మొదట క్రికెట్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని తాను కోరుకుంటున్నానన్నాడు. ప్రస్తుతం చాలా మంది కొత్త కుర్రాళ్లు ఉన్నారు, వారికి బాధ్యతలు అప్పగించాలని నాకు తెలుసునని.. కానీ వారు కెప్టెన్సీని సాధించడానికి కష్టతరమైన క్రికెట్‌ను ఆడనివ్వాలని.. వారికంటే ముందు బుమ్రా, కోహ్లీ ఉన్నారని తెలిపాడు. భారత జట్టుకు సారథ్యం వహించడం అనేది చిన్న విషయం కాదని.. మన చరిత్ర, క్రికెట్ ఆడిన తీరును బట్టి చూస్తే.. కెప్టెన్సీ అనేది పెద్ద బాధ్యత అనే అర్థం చేసుకోవాలని చెప్పాడు.