Rohit Sharma | దుబాయ్: హైబ్రిడ్ మోడల్లో భాగంగా చాంపియన్స్ ట్రోఫీలో తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఒకే వేదికపై ఆడుతున్న భారత జట్టుకు ‘పిచ్ అడ్వాంటేజ్’ లభిస్తుందని వస్తున్న విమర్శలకు టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. దుబాయ్ తమ సొంత గ్రౌండ్ కాదని, ఇక్కడి పిచ్‌లు తమకూ కొత్త సవాళ్లను విసురుతున్నాయని తెలిపాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు నాసిర్ హుస్సేన్, అథర్టన్‌తో పాటు ఆసీస్ సారథి పాట్ కమిన్స్.. భారత్ అన్ని మ్యాచ్‌లను ఒకే వేదికపై ఆడటం వారికి భారీ ప్రయోజనాన్ని చేకూర్చుతుందని వ్యాఖ్యానించిన విషయం విదితమే. న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ‘మేమిక్కడ మూడు మ్యాచ్‌లు ఆడాం.
మూడింట్లోనూ పిచ్ భిన్నంగా స్పందించింది. ప్రతిమ్యాచ్‌లోనూ ఇక్కడ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇదేం మా సొంత వేదిక కాదు. దుబాయ్ మాక్కూడా కొత్తే. ఇక్కడ నాలుగైదు పిచ్‌లు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఆరంభంలో బంతి కాస్త స్వింగ్ అయింది. మొదటి రెండు మ్యాచ్‌లలో పిచ్ అలా స్పందించలేదు. గత మ్యాచ్‌లలో బంతి మేం ఆశించినంత తిరగలేదు. కానీ కివీస్‌తో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో బంతి స్పిన్‌కు అనుకూలంగా ఉంది. ఆస్ట్రేలియాతో సెమీస్‌కు ఏ పిచ్‌ను ఉపయోగిస్తారో మాకు తెలియదు. అయితే ఏం జరిగినా అందుకు తగ్గట్టుగా మేం ఆ పరిస్థితులను ఆకలింపు చేసుకోవాలి’ అని తెలిపాడు.
రోహిత్‌తో పాటు మాజీ సారథి సౌరవ్ గంగూలీ కూడా ఈ విమర్శలకు గట్టిగానే బదులిచ్చాడు. దాదా మాట్లాడుతూ ‘దుబాయ్ కంటే పాకిస్థాన్ పిచ్‌లు కాస్త మెరుగ్గా ఉంటాయి. ఒకవేళ టీమ్ఇండియా గనక అక్కడ ఆడి ఉంటే భారీ స్కోర్లు చేసేది. పిచ్ అడ్వాంటేజ్‌పై కొందరు చేస్తున్న వ్యాఖ్యలన్నీ చెత్తవే. భారత జట్టు గతేడాది టీ20 ప్రపంచకప్ నెగ్గింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత చాలా బలమైన ప్రత్యర్థి. మేం ఎవరినైనా ఓడించగలం’ అని వ్యాఖ్యానించాడు.