న్యూఢిల్లీ : వచ్చే నెలలో ఆఫ్ఘానిస్థాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (రోకో)ను జట్టులోకి ఎంపిక చేయడంపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ తొలుత వీరికి విశ్రాంతి ఇవ్వాలని భావించినప్పటికీ, చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే జరుగతున్న సిరీస్ కావడంతో ఆటగాళ్లపై ఉండే పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని రోకోకు బ్రేక్ ఇవ్వాలని సెలెక్టర్లు అనుకున్నారు.
అయితే, ఇద్దరూ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో కేవలం వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతుండటంతో.. వారికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని సెలెక్షన్ కమిటీ భావించింది. నిరంతరం వన్డేలు ఆడితేనే లయ తప్పకుండా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుంది.అలాగే, భారత జట్టు ప్రస్తుతం మార్పుల దిశగా వెళ్తోంది. ఇలాంటి సమయంలో యువ ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి జట్టులో కుదురుకోవాలంటే.. ఈ దిగ్గజాల అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావించినట్టు తెలుస్తోంది. దాంతో పాటు 2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. సీనియర్ల ప్రదర్శనను, వారి ఫిట్నెస్ స్థాయిలను నిరంతరం పరిశీలించడానికి కూడా ఈ సిరీస్ ఉపయోగపడనుంది.భారత్-ఆఫ్ఘాన్ వన్డే సిరీస్ జూన్ 13న ప్రారంభం కానుంది.