న్యూఢిల్లీ: 2027లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడేది డౌటే అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) తెలిపాడు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రోహిత్, కోహ్లీలు ఇటీవల టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టెస్టు, టీ20లకు రిటైర్ అయిన నేపథ్యంలో.. ఆ ఇద్దరూ 2027లో వన్డే వరల్డ్‌కప్ ఆడుతారన్న నమ్మకం లేదన్నారు. చాలా హుందాగా ఈ విషయాన్ని చెబుతున్నానని, వాళ్లు ఆ వరల్డ్‌కప్‌లో ఆడేది అనుమానమే అని, ఒకవేళ వాళ్లు సెంచరీల మీద సెంచరీలు చేస్తే .. ఆ దేవుడు కూడా వాళ్లను ఆపలేరని గవాస్కర్ అన్నాడు.
ఆ ఇద్దరి వన్డే భవిష్యత్తు సెలెక్షన్ కమిటీ చేతుల్లో ఉంటుందన్నాడు. టెస్టులకు కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడాన్ని గవాస్కర్ తప్పుపట్టలేదు. సెలెక్టర్లతో చర్చించిన తర్వాత ఆ ఇద్దరు ఆటగాళ్లు నిర్ణయం తీసుకుని ఉంటారని గవాస్కర్ పేర్కొన్నాడు. టెస్టులకు విరమణ ప్రకటించాలన్న నిర్ణయాన్ని.. వాళ్లకు వాళ్లే తీసుకోవడం మంచి పరిణామం అని, అనుకున్నట్లే జరిగిందన్నాడు.
టెస్టులకు బుమ్రాను కెప్టెన్‌గా చేయాలన్న నిర్ణయాన్ని గవాస్కర్ సమర్థించాడు. మరో వ్యక్తిని కెప్టెన్‌గా చేస్తే బుమ్రాపై భారం పడే అవకాశం ఉందన్నాడు. వికెట్ల కోసం బుమ్రాకు ఎక్స్ట్రా ఓవర్లు వేయమంటారని, ఒకవేళ అతనే కెప్టెన్ అయితే, అతనికి కావాల్సిన సమయంలో రెస్ట్ తీసుకునే ఛాన్సు ఉంటుందన్నాడు.