Rohan Bopanna : భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న(Rohan Bopanna) చరిత్ర సృష్టించాడు. నలభై ఏళ్లు దాటినా.. ఉరకలేసే ఉత్సాహంతో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న బోపన్న తాజాగా ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నమెంట్లో అదరగొట్టాడు. డబుల్స్‌లో అద్భుత విజయం సాధించి.. ఈ టోర్నీలో ఒక మ్యాచ్ గెలుపొందిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడీ టెన్నిస్ లెజెండ్. తద్వారా 45 ఏళ్లున్న బోపన్న కెనడాకు చెందిన డానియెల్ నెస్టర్ను అధిగమించాడు. 2017లో మాడ్రిడ్ మాస్టర్స్‌లో గెలుపొందే నాటికి డానియెల్ వయసు.. 44 ఏళ్ల 8 నెలలు.
మొనాకో వేదికగా జరుగుతున్న మాంటే కార్లో మాస్టర్స్( Monte Carlo Masters)లో బోపన్న అమెరికాకు చెందిన బెన్ షెల్టన్‌తో కలిసి బరిలోకి దిగాడు. రౌండ్ 32లో భాగంగా ఫ్రాన్సిస్కో సెరుండొలో, అలెజండ్రో తబిలో జంటతో తలపడింది బోపన్న ద్వయం. ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించిన ఈ జోడీ.. 71 నిమిషాల్లోనే 6-3, 7-5తో చిత్తు చేసింది. ప్రస్తుతం బోపన్న, షెల్టన్ జోడీ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో కొనసాగుతోంది.
Early W for Ben & Bopanna 😄
New doubles pair @BenShelton & @rohanbopanna defeat Cerundolo & Tabilo 6-3 7-5 at the #RolexMonteCarloMasters pic.twitter.com/jKpKYmzryj
— Rolex Monte-Carlo Masters (@ROLEXMCMASTERS) April 6, 2025
వయసు పైబడుతున్న కొద్ది రాటుదేలుతున్న ఆటగాళ్లలో బోపన్న ఒకరు. 2024 సీజన్లో మాథ్యూ ఎబ్డెన్ జతగా డబుల్స్‌లో చెలరేగి ఆడిన అతడు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలుపొందాడు. దాంతో, ఆ ఏడాది ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానం సాధించాడు బోపన్న. ఫలితంగా.. అతి పెద్ద వయసులో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు బోపన్న. ప్రస్తుతం 45 ఏళ్లు ఉన్న ఈ స్టార్ ప్లేయర్ ఈ ఏడాది వీడ్కోలు పలికే అవకాశముంది.