China Open 2024 : భారత సీనియర్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న (Rohn Bopanna) ఓటముల పరంపర కొనసాగుతోంది. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు ముందే ఇంటిదారి పట్టిన బోపన్న.. తాజాగా చైనా ఓపెన్ (China Open2024)లోనూ నిరాశపరిచాడు. ఏటీపీ 500 టోర్నీ అయిన చైనా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో ఇవాన్ డోడిగ్(క్రొయేషియా)తో కలిసి ఆడిన భారత స్టార్‌కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో బోపన్న ద్వయానికి అన్‌సీడెడ్ ఆటగాళ్లు చెక్ పెట్టారు.
చైనా ఓపెన్‌లో ఫేవరెట్‌గా అడుగుపెట్టిన బోపన్న – ఇవాన్ జోడీకి ఫ్రాన్సిస్కో సెరునుడొలో, నికోలస్ జారీలు ఊహించని షాక్ ఇచ్చారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఫ్రాన్సిస్కో, నికోలస్ ద్వయం బోపన్న జంటకు గట్టి పోటీనిచ్చింది. తొలి సెట్‌ను ఒక్క పాయింట్ తేడాతో గెలుపొంది.. రెండో సెట్‌ను కూడా అంతే తేడాతో సొంతం చేసుకుంది. దాంతో, బోపన్న ద్వయం 5-6, 6-7తో అనూహ్యంగా ఓటమి పాలైంది.
Not a great result for Rohan Bopanna/Ivan Dodig pair!! #ChinaOpen2024 pic.twitter.com/ZGG7znYqO4
— Sport in a nutshell (@Shuvo10976159) September 28, 2024
భారత స్టార్ బోపన్న క్రొయేషియా కెరటం ఇవాన్‌తో కలిసి ఆడడం ఇదే మొదటిసారి కాదు. వీళ్లిద్దరూ 2017 ఏటీపీ మాంట్రియల్ మాస్టర్స్ 1000 టోర్నీలో దుమ్మురేపారు. కానీ, ఆఖరి మెట్టుపై తడబడి రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో బోపన్న అదరగొట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన మ్యాథ్యూ ఎబ్డెన్ (Mathews Ebden) జతగా ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా అవతరించాడు. తద్వారా 41 ఏండ్ల వయసులో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీతో చరిత్ర సృష్టించారు. అనంతరం ఈ ద్వయం మియామీ ఓపెన్(Miami Open) టైటిళ్లు కూడా గెలుపొందింది.
కానీ, ఆ తర్వాత ఈ జోడీ పెద్దగా రాణించలేదు. తాజాగా యూఎస్ ఓపెన్‌లోనూ నిరాశపరిచింది. ఇక చైనా ఓపెన్ నుంచి ఎబ్డెన్ వైదొలగడంతో ఇవాన్‌తో ఆడాలని బోపన్న నిర్ణయించుకున్నాడు. అయినా సరే ఫలితం మాత్రం మారలేదు.