Rohan Bopanna | పారిస్: ‘వయసు ఒక అంకె’ మాత్రమే అని మరోసారి నిరూపించాడు భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న. వన్నె తగ్గని ఆట, ఫిట్నెస్తో యువ ఆటగాళ్లకు సవాల్ విసురుతున్న బోపన్న.. 45 ఏండ్ల వయసులోనూ టెన్నిస్ మ్యాచ్ గెలిచిన పెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఫ్రాన్స్‌లోని మాంటె-కార్లో కంట్రీ క్లబ్ వేదికగా జరుగుతున్న మాంటె-కార్లో మాస్టర్స్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో బోపన్న-బెన్ షెల్టన్ (అమెరికా) ద్వయం 6-3, 7-5తో ఫ్రాన్సిస్కో (అర్జెంటీనా)-అలెజండ్రో(చిలీ)పై గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.
తద్వారా బోపన్న ఏటీపీ మాస్టర్స్ 1000 ఈవెంట్ చరిత్రలో సింగిల్స్ లేదా డబుల్స్ మ్యాచ్ గెలిచిన పెద్ద వయస్కుడి (45 ఏండ్ల ఒక నెల రోజులు)గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు కెనడాకు చెందిన డేనియల్ నెస్టర్ పేరిట ఉండేది. 44 ఏండ్ల 8 నెలల వయసులో నెస్టర్.. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్యాబ్రిస్ మార్టిన్‌తో కలిసి మ్యాచ్ గెలవడమే ఇప్పటిదాకా రికార్డు.
ఆసక్తికరమైన విషయమేంటంటే.. నెస్టర్-ఫ్యాబ్రిస్ కలిసి ఓడించింది బోపన్న-పాబ్లొ ద్వయాన్నే కావడం గమనార్హం. 2017లో మాడ్రిడ్ మాస్టర్స్ ఇందుకు వేదికైంది. ఇదిలా ఉండగా మాంటె-కార్లొ మాస్టర్స్ డబుల్స్‌లో మరో భారత ఆటగాడు యుకీ బాంబ్రీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది.