దుబాయ్: టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కెరీర్లో హయ్యస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకులలో అతడు ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని ఏడో స్థానానికి దూసుకెళ్లాడు. రెండ్రోజుల క్రితం లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టులో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొట్టిన పంత్.. ర్యాంకుతో పాటు రేటింగ్ పాయింట్లనూ మెరుగుపరుచుకున్నాడు.
ప్రస్తుతం పంత్.. 801 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక వికెట్ కీపర్ బ్యాటర్ ఇన్ని రేటింగ్ పాయింట్లు సాధించడం ఇదే ప్రథమం. ఇక ర్యాంకింగ్ జాబితాలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (889 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా అదే దేశానికి చెందిన హ్యారీ బ్రూక్ రెండో స్థానంలో ఉన్నాడు. యశస్వీ జైస్వాల్ (851) నాలుగో స్థానాన్ని నిలుపుకున్నాడు. భారత టెస్టు సారథి శుభ్‌మన్ గిల్ 5 స్థానాలు మెరుగుపరుచుకుని 20వ స్థానానికి ఎగబాకాడు.