సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ మొదలవడానికి ముందు.. భారతే ఫేవరెట్. టీ20 స్పెషలిస్టులకు కొదవలేని టీమిండియా ఓడిపోతుందనే ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. అలాంటిది మొదటి రెండు మ్యాచుల్లో ఓటమి చవి చూసిన భారత్.. సిరీస్ ఓటమికి అడుగు దూరంలో నిలిచింది. ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు ఆడకపోవడం, రాహుల్ కూడా గాయంతో దూరమవడంతో కీపర్ పంత్‌కు కెప్టెన్సీ ఇచ్చారు.
ఇప్పుడు దీనిపైనే క్రికెట్ అభిమానులు చర్చలు జరుపుతున్నారు. పంత్ కెప్టెన్సీ వల్లనే భారత్ ఓడిపోయిందని అంటున్నారు. దీనిపై రంజీ ట్రోఫీ లెజెండ్, భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. పంత్‌లో కెప్టెన్సీకి అవసరమైన మానసిక బలం లేదన్నాడు. పరిస్థితులు కొంచెం చెయ్యి దాటగానే పంత్ భయపడిపోతున్నాడని, కెప్టెన్సీ చేస్తూ ఉంటేనే ఆ విషయంలో అతను మెరుగవుతాడని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్లో కూడా జట్టు కూర్పు విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్న పంత్.. చివర్లో ఒత్తిడికి గురై క్యాచులు వదిలేయడం, డీఆర్ఎస్ తప్పులు చేసి తమ జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. ఇదే విషయాన్ని జాఫర్ గుర్తుచేశాడు. ‘‘మనం ఐపీఎల్లో కూడా ఇది చూశాం. అతను ఎంత ఎక్కువ కెప్టెన్సీ చేస్తే అంత మెరుగవుతాడని నా నమ్మకం. ప్రస్తుతానికైతే మాత్రం, మ్యాచ్ కొంచెం టఫ్‌గా మారినా పంత్ తత్తరపడిపోతున్నాడు’’ అని తేల్చిచెప్పాడు.
అలాగే ఐదు మ్యాచుల సిరీస్‌లో 2-0తో వెనుకబడటం అంటే దాదాపుగా సిరీస్ చేజారినట్లేనని అన్నాడీ మాజీ ఓపెనర్. టాస్ గెలవడం కూడా ఒక్కోసారి ముఖ్యమని, ఓడిన రెండు మ్యాచుల్లో కూడా పంత్ టాస్ గెలవలేదని చెప్పాడు. మిగతా మూడు మ్యాచుల్లో భారత జట్టు అత్యుత్తమంగా రాణించడం తప్పితే ఏమీ చెయ్యలేదన్న జాఫర్.. ఏ ఒక్క మ్యాచ్ అటూ ఇటూ అయినా సిరీస్ చేజారిపోతుందని వివరించాడు. కాబట్టి టాస్ ఓడినా, గెలిచినా సామర్ధ్యానికి మించి ఆడటం తప్పితే భారత జట్టు వద్ద మరో ఆప్షన్ లేదని స్పష్టంచేశాడు.