రిషభ్ పంత్.. టీమిండియా యువ సంచలనం. జట్టులో రెగ్యులర్‌గా అతని స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదని అంతా అనుకున్నారు. కానీ ఆసియా కప్‌లో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లో.. అది దాయాదుల పోరులో పంత్‌ను పక్కన పెట్టింది టీమ్ మేనేజ్మెంట్. ఈ నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
అయితే టీ20 ఫార్మాట్లో పంత్ పెద్దగా చేసిందేమీ లేదని, ఈ ఫార్మాట్లో పంత్ ఫామ్ అంతంతమాత్రమేనని, అందుకే అతన్ని పక్కనపెట్టి దినేష్ కార్తీక్‌ను తీసుకున్నారని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అంటున్నాడు. టీ20ల్లో పంత్ ఆకట్టుకునే ప్రదర్శనలు చెయ్యలేదని జాఫర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు.
‘‘టెస్టులు, వన్డేల్లో పంత్ బాగా ఆడుతున్నాడు. ఇటీవలి కాలంలో అతను ఆడిన ఇన్నింగ్స్‌లు అద్భుతంగా ఉన్నాయి. కానీ టీ20 కోడ్‌ను పంత్ క్రాక్ చెయ్యలేదు. ఐపీఎల్లో కూడా అతను అలాంటి ఫామ్ కనబర్చలేదు. కానీ డీకే విషయం వేరు. ఐపీఎల్ నుంచి తనకు అప్పజెప్పిన రోల్‌ను చక్కగా పోషిస్తున్నాడతను.
కాకపోతే పంత్ లేకపోవడంతో జడేజా తప్ప మరో ఎడంచేతి వాటం బ్యాటర్ లేకపోవడం కొంత ఇబ్బంది. ముఖ్యంగా ఎడం చేతి వాటం పేసర్లు వస్తే కష్టంగా ఉంటుంది’’ అని జాఫర్ వివరించాడు. మరో మాజీ ఆటగాడు దీప్ దాస్ గుప్తా మాట్లాడుతూ.. ఇది కఠిన నిర్ణయమని, కానీ జట్టులో డీకే మరింత ప్రత్యేకమని చెప్పాడు.
డీకే ఒక రోల్‌కు పరిమితమై ఆడుతున్నాడని, పంత్ ఫ్లోటర్‌గా ఉన్నాడని వివరించాడు. పంత్‌ను పక్కనపెట్టడం తనకు నచ్చనప్పటికీ.. ఒక ప్లాన్ వేసుకొని దానికే జట్టు కట్టుబడటం కరెక్టెనని తేల్చేశాడు. మరి మిగతా మ్యాచుల్లో పంత్‌ను తీసుకుంటారా? లేక ఇలాగే పక్కనపెడతారా? అనేది తెలియాలంటే వేచి చూడక తప్పదు.