Rishabh Pant : భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం కోసం ఎంతో ఆతృతగా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో తనదైన మెరుపులతో జట్టుకు చిరస్మరణీయ విజయాలందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 16 నెలల తర్వాత టీమిండియా జెర్సీ వేసుకున్న పంత్ ఆ దేవుడికి ధన్యవాదాలు తెలిపాడు. వరల్డ్ కప్ జెర్సీ వేసుకున్న సంతోషంలో పంత్ దైవాన్ని యాది చేసుకున్నాడు. తన మనసులోని మాటల్ని వ్యక్తపరుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ డాషింగ్ బ్యాటర్ ఓ పోస్ట్ పెట్టాడు.
పంత్ తన పోస్ట్‌లో పేసర్లు బుమ్రా, సిరాజ్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌లతో దిగిన ఫొటోల్ని పెట్టాడు. ‘భగవంతుడా నీకు ధన్యవాదాలు. ఈ జెర్సీ వేసుకోన్నందుకు నా మనసంతో కృతజ్ఞతా భావం, సంతోషం, గర్వంతో నిండిపోయింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప ఫీలింగ్ ఇంకేముంటుంది’ అని పంత్ తన పోస్ట్‌కు క్యాప్షన్ రాశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
ఏదాదిన్నర క్రితం జరిగిన కారు యాక్సిటెంట్ పంత్ జీవితాన్ని మార్చేసింది. అప్పటిదాగా క్రికెట్ ఆటే ప్రపంచగా బతికిన అతడు ఒక్కసారిగా మంచానికే పరిమితమయ్యాడు. యాక్సిడెంట్ సమయంలో దాదాపు చావు నోట్లో తలపెట్టి వచ్చిన పంత్.. అనంతరం మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో కఠిన కసరత్తులు చేసి ఐపీఎల్ పదిహేడో సీజన్‌తో మైదానంలోకి దిగాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సారథి ఆడిన పంత్ దూకుడైన ఆటతో, వికెట్ల వెనకాల స్టన్నింగ్ క్యాచ్‌లతో అభిమానులను అలరించాడు. పంత్ 13 ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధ శతకాలతో 5446 రన్స్ కొట్టాడు.

ఐపీఎల్ ప్రదర్శనతో సంజూ శాంసన్( sanju samson)తో పాటు వికెట్ కీపర్‌గా వరల్డ్ కప్ బృందంలో ఈ లెఫ్ట్ హ్యాండర్ చోటు దక్కించుకున్నాడు. అయితే.. వీళ్లలో ఎవరు తుది జట్టులో ఉంటారు? ఎవరెన్ని మ్యాచ్‌లు ఆడుతారు? అనేది మరో మూడు రోజుల్లో తెలియనుంది. మెగా టోర్నీకి ముందు టీమిండియా జూన్ 1న బంగ్లాదేశ్‌తో వామప్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత వరల్డ్ కప్ లీగ్ మ్యాచుల్లో భాగంగా జూన్ 5న ఐర్లాండ్‌తో… జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది.