హెడింగ్లీ: భారత్‌తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు బంతితో విఫలమైన ఇంగ్లండ్.. రెండో రోజు మాత్రం పుంజుకుంది. బంతితో టీమ్ఇండియాను కట్టడిచేసిన బెన్ స్టోక్స్ సేన.. బ్యాట్‌తోనూ తమకు అచ్చొచ్చిన ‘బజ్‌బాల్’ ఆటతో దీటుగా బదులిస్తున్నది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియాను తొలి సెషన్లోనే 471 పరుగులకు ఆలౌట్ చేసిన ఆ జట్టు.. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి రెండో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓలీ పోప్ (131 బంతుల్లో 100 నాటౌట్, 13 ఫోర్లు) అజేయ శతకంతో మెరవగా, బెన్ డకెట్ (94 బంతుల్లో 62, 9 ఫోర్లు) రాణించారు.
ప్రస్తుతం పోప్‌తో పాటు హ్యారీ బ్రూక్ (0 నాటౌట్) క్రీజులో ఉండగా తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకా 262 రన్స్ వెనుకబడి ఉంది. అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మెన్ ఇన్ బ్లూ.. ఓవర్ నైట్ స్కోరుకు 112 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. రిషభ్ పంత్ (178 బంతుల్లో 134, 12 ఫోర్లు, 6 సిక్సర్లు) రికార్డు శతకంతో కదం తొక్కగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (147).. మొదటి రోజు ఆటకు మరో 20 పరుగులు జోడించాడు. బెన్ స్టోక్స్, జోష్ టంగ్ తలా నాలుగు వికెట్లు పడగొట్టారు.
క్రీజులో ఇద్దరు శతకాలు చేసిన బ్యాటర్లతో పాటు మరో ఏడు వికెట్లు చేతిలో ఉండటంతో టీమ్ఇండియా అలవోకగా 550+ స్కోరు చేస్తుందని ఆశించిన అభిమానులకు ఒకింత నిరాశ ఎదురైంది. 41 పరుగుల వ్యవధిలో భారత్ చివరి 7 వికెట్లను కోల్పోయింది. బషీర్ ఓవర్లో గిల్.. జోష్ టంగ్‌కు క్యాచ్ ఇవ్వడంతో 209 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సుదీర్ఘకాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ (0).. స్టోక్స్ బౌలింగ్‌లో షార్ట్ కవర్ వద్ద ఓలీ పోప్ కండ్లు చెదిరే క్యాచ్‌తో డకౌట్‌గా వెనుదిరిగాడు. టంగ్ ఓవర్లో పంత్ వికెట్ల ముందు బలవగా లంచ్‌కు ముందు స్టోక్స్.. శార్దూల్‌ను ఔట్ చేశాడు. భోజన విరామం తర్వాత టంగ్.. రెండు ఓవర్ల వ్యవధిలో బుమ్రా, జడేజా, ప్రసిద్ధ్‌ను వెనక్కి పంపడంతో టీమ్ఇండియా ఆలౌటైంది.
భారత ఇన్నింగ్స్ ముగిశాక వర్షం రావడంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగినా ఆ తర్వాత ఇంగ్లండ్.. బజ్‌బాల్ విధ్వంసం సృష్టించింది. టీమ్ఇండియా తురుపుముక్క బుమ్రా.. తొలి ఓవర్లోనే జాక్ క్రాలీ (4)ని ఔట్ చేసినా భారత్ ఆ దూకుడును కొనసాగించలేకపోయింది. క్రీజులో కుదురుకునేదాకా డకెట్ కాస్త నెమ్మదిగా ఆడినా మూడో స్థానంలో వచ్చిన పోప్ మాత్రం ఆరంభం నుంచే బ్యాటుకు పనిచెప్పడంతో ఇంగ్లండ్ రన్‌రేట్ 5కు తగ్గకుండా దూసుకెళ్లింది. ఓవర్‌కు తలా ఓ బౌండరీతో రెచ్చిపోయిన ఈ జంటను విడదీయడానికి గిల్ పదేపదే బౌలర్లను మార్చి ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది.
ఈ ద్వయం బుమ్రాతో పాటు సిరాజ్, ప్రసిద్ధ్ బౌలింగ్‌లో వేగంగా పరుగులు రాబట్టింది. జడేజా వేసిన 22వ ఓవర్లో స్వేర్ లెగ్ బౌండరీతో డకెట్ 68 బంతుల్లో అర్ధ శతకంతో పాటు ఈ జోడీ వంద పరుగుల భాగస్వామ్యం పూర్తైంది. టీ విరామం అనంతరం బుమ్రా వేసిన ఓవర్లో ఫోర్‌తో పోప్ హాఫ్ సెంచరీ పూర్తైంది. అయితే జస్ప్రీత్.. 28వ ఓవర్లో డకెట్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి 122 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. డకెట్ నిష్క్రమణ తర్వాత ఇంగ్లండ్ స్కోరువేగం కూడా మందగించింది. జో రూట్ (28) ఆరంభంలో బుమ్రా, సిరాజ్‌ను ఎదుర్కునేందుకు ఇబ్బందిపడ్డాడు. 80లలోకి వచ్చాక మళ్లీ దూకుడు పెంచిన పోప్.. బుమ్రా బౌలింగ్‌లో సింగిల్‌తో తన కెరీర్లో తొమ్మిదో శతకాన్ని నమోదుచేశాడు. కానీ మరుసటి బంతికే రూట్.. స్లిప్స్‌లో కరుణ్ చేతికి చిక్కాడు. టెస్టులలో బుమ్రా బౌలింగ్‌లో ఔట్ అవడం రూట్‌కు ఇది పదోసారి కావడం విశేషం. బుమ్రా బౌలింగ్‌లోనే బ్రూక్.. సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చినా అది కాస్తా నోబాల్ కావడంతో అతడు బతికిపోయాడు.
ఓవర్ నైట్ స్కోరు 359/3తో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్.. తొలి గంటన్నర పాటు మొదటి రోజు జోరునే కొనసాగించింది. వోక్స్ వేసిన రెండో ఓవర్లోనే ఆఫ్‌సైడ్ చూడచక్కని స్ట్రోక్‌తో గిల్ బంతిని బౌండరీకి తరలించాడు. మొదటి రోజు కాస్త సంయమనంగా ఆడిన పంత్.. రెండో రోజు మాత్రం తన సహజ శైలికి వచ్చేశాడు. బషీర్ బౌలింగ్‌లో 4, 6తో 90లలోకి వచ్చిన ఈ వికెట్ కీపర్.. డ్రింక్స్ విరామం తర్వాత బషీరే వేసిన 99వ ఓవర్లో తొలి బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాది 146 బంతుల్లో తన కెరీర్లో ఏడో శతకాన్ని అందుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై పంత్‌కు ఇది మూడో శతకం. సెంచరీ తర్వాత అతడు మరింత ధాటిగా ఆడాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: భారత్ తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్ (గిల్ 147, పంత్ 134, స్టోక్స్ 4/66, టంగ్ 4/86);
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 49 ఓవర్లలో 209/3 (పోప్ 100*, డకెట్ 62, బుమ్రా 3/48)